శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 6 అక్టోబరు 2022 (11:46 IST)

భారత రాష్ట్ర సమితి పార్టీ లక్ష్యం ఏంటి? కేసీఆర్ 'తెలంగాణ ప్రాంతీయ ఐడెంటిటీ'ని దాటుకుని జాతీయ నాయకుడు కాగలరా?

BRS
కొద్ది రోజుల కిందట దిల్లీకి చెందిన డెబ్బై ఏళ్ల మాజీ జర్నలిస్టు ఒకరు హైదరాబాద్ ప్రగతి భవన్‌లో కనిపించారు. కొన్నాళ్లు జర్నలిస్టుగా ఉండిన ఈ పెద్దాయన ఆ తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అయ్యారు. ఇపుడు ఏం చేస్తున్నారో తెలియదు గాని, ఉన్నట్టుండి ఆయన ప్రగతి భవన్‌లో ప్రత్యక్షమయ్యారు. చాలా రోజుల కిందట ఒక హవాలా కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు సరిగా లేదని సుప్రీంకోర్టులో ఆయన పిల్ వేశారు. దీని మీద సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. సీబీఐ మీద విజిలెన్స్ కమిషన్ అజమాయిషీ ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన అప్పట్లో బాగా పాపులర్ అయ్యారు.

 
ఆయన ప్రగతి భవన్‌లో ఒకటి రెండు రోజులు ముఖ్యమంత్రి కేసీఆర్ అతిథిగా ఉన్నారు. తాను స్థాపించాలనుకుంటున్న జాతీయ పార్టీ మీద దిల్లీలోని మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేసే బాధ్యతను కేసీఆర్ ఆయనకు అప్పగించారు. ఈ మాజీ జర్నలిస్టు దిల్లీలో ఉన్న చాలా మంది సీనియర్ జర్నలిస్టులకు, యూనివర్సిటీల్లో ఉండే ప్రొఫెసర్లకు, ఇతర మేధావులకు ఫోన్ చేసి కేసీఆర్ అభిలాష గురించి చెప్పారు. దానితో చాలా మంది దిల్లీ జర్నలిస్టులు, ప్రొఫెసర్లు హైదరాబాద్‌లో ఉన్న మిత్రులకు ఫోన్ చేసి కేసీఆర్ జాతీయ పార్టీ గురించి వాకబు చేయడం మొదలు పెట్టారు.

 
అయితే, ఏమైందో ఏమోగాని సెప్టెంబర్‌లో జరుగుతుందనుకున్న ఒక సమావేశం జరగలేదు. అయితే కొంతమంది మేధావులు కేసీఆర్ జాతీయ పార్టీ ఆలోచన విని ఆశ్చర్యపోయారు. ఇపుడున్న పరిస్థితుల్లో జాతీయ పార్టీ సాధ్యమా? ఒక బలమైన ప్రాంతీయ నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ 'తెలంగాణ ప్రాంతీయ ఐడెంటిటీ' నుంచి బయటపడి జాతీయ నాయకుడిగా ఇతర ప్రాంతీయ రాజకీయాల్లో గుర్తింపు పొందగలరా? అనే చిన్న చర్చ ఈ వర్గంలో మొదలైంది. ఉత్తరాది రాష్ట్రాల మేధావులతో సమావేశాలు పెట్టి, తాను ఏర్పాటు చేయాలనుకుంటున్న పార్టీ మీద పెద్ద చర్చ జరిగేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

 
ఇంతపెద్ద ఇండియాలో మూడో జాతీయ పార్టీకి చోటే లేదా?
దేశంలో ఒక జాతీయపార్టీ అవతరించక చాలా కాలమైంది. స్వతంత్రం వచ్చాక భారతదేశ జాతీయ పార్టీల చరిత్ర తీసుకుంటే బీజేపీ తర్వాత కొత్త జాతీయ పార్టీలేవీ ఏర్పడలేదు. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ పేర్లలో 'ఆల్ ఇండియా' అని పేరు పెట్టుకున్నా(ఏఐఏడీఎంకే, ఏఐఎమ్ఐఎమ్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) అవేవీ అఖిల భారత పార్టీలు కాలేకపోయాయి. ఎన్నికల కమిషన్ నిర్వచనం ప్రకారం రెండు మూడు రాష్ట్రాలలో పోటీ చేసో, ఒకటి అరా సీట్లు గెలిచో నేషనల్ పార్టీ హోదా సంపాదించాకున్నాయి గాని, అసలైన అఖిల భారత పార్టీలుగా విస్తరించలేకపోయాయి. మరొక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి ప్రాంతీయ పార్టీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీయే.

 
ఎన్నికల కమిషన్ నిర్వచనం ప్రకారం ఇపుడు ఇండియాలో జాతీయ పార్టీ హోదా పొందిన ప్రాంతీయ పార్టీల ఆనవాళ్లు సొంత రాష్ట్రం బయట నామమాత్రమే. మరొకవైపు కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం కుంచించుకుపోయి జాతీయ పార్టీ హోదా కోల్పోయే ప్రమాదం అంచుల దాకా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. రెండు అఖిల భారత పార్టీలలో ఒకటి 1885లో పుట్టిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రెండోది ఆ తర్వాత దాదాపు వందేళ్లకు 1980లో ఉనికిలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ. 1885-1980 మధ్య దాదాపు శతాబ్ద కాలంలో అనేక జాతీయ పార్టీలు వచ్చాయి, పోయాయి. సోషలిస్టు పార్టీలు, భారతీయ జనసంఘ్, ముస్లిం లీగ్, కొన్ని కిసాన్ పార్టీలు, రకరకాల వామపక్షాల పార్టీలు అఖిల భారత స్థాయిలో ప్రాచుర్యం పొందినా, అవి కొన్ని సంవత్సరాల తర్వాత రూపాంతరం చెందడమో లేక రూపు మాసిపోవడమో జరిగింది.

 
ఈ పరిణామం ఎన్నికల్లో కూడా చూడవచ్చు. 1952లో జరిగిన మొదటి లోక్ సభ ఎన్నికల్లో 14 జాతీయ పార్టీలుండేవి. క్రమంగా వీటి సంఖ్య 2019 నాటికి ఏడుకు పడిపోయింది. 2019లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీకి జాతీయ పార్టీ హోదా రావడంతో దేశంలో జాతీయ పార్టీల సంఖ్య ఇపుడు ఎనిమిదికి పెరిగింది. జాతీయ పార్టీలనేవి ఎన్నికల కమిషన్ నిర్వచనం ప్రకారం పొందిన అర్హతే తప్ప అఖిల భారత స్థాయికి విస్తరించిన పార్టీ అని అర్థం కానే కాదు. వీటిని మల్టీస్టేట్ పార్టీలు అనడమే సబబు. ఈ జాతీయ పార్టీ హోదా ఓట్ల ఆధారంగా, సీట్ల అధారంగా వస్తుంది. ఇతర రాష్ట్రాలలో పోటీ చేసి ఓట్లు పొందినా సీట్లు పొందినా అథమం నాలుగు రాష్ట్రాలలో గుర్తింపు పొందినా జాతీయ హోదా వస్తుంది. ఒక పార్టీకి జాతీయ పార్టీ హోదా రావాలంటే అర్హతలేమిటో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్‌లో స్పష్టంగా చెప్పారు. అంతే తప్ప 'జాతీయ పార్టీ' అని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమనేదేమీ ఉండదు. ఈ హోదాను సాధించడమే తప్ప ప్రకటించుకోవడం అనేది ఉండదు.

 
ప్రాంతీయ పార్టీల యుగంలో 'జాతీయ హోదా'
ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే, ఈ పార్టీలు భారతదేశంలో 1952 నుంచి ఉన్నాయి. ఆయేడాది 19 ప్రాంతీయపార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే, ఈ ప్రాంతీయ పార్టీలు ఈ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చింది 1984 తర్వాతే. కేంద్రంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి వచ్చింది ఆ యేడాదిలోనే. అదే చివరి సారి కూడా. ఆ తర్వాత ఆ పార్టీ పతనం మొదలైంది. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు చొరవతో ఏర్పడిన ప్రాంతీయ పార్టీల కూటమి 'నేషనల్ ఫ్రంట్' ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత ఈ కూటములే ఏదో ఒక రూపంలో అంటే బీజేపీ నాయకత్వంలో ఎన్డీయేగా కొన్నాళ్లు, కాంగ్రెస్ నాయకత్వంలో యూపీయేగా మరికొన్నాళ్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. జాతీయ పార్టీ చుట్టూ కూటమి ఏర్పడినపుడు లోక్ సభలు పూర్తికాలం కొనసాగాయి.

 
1989-2014 మధ్య జాతీయపార్టీలు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంతగా లోక్ సభలో ఆధిక్యత సంపాదించలేకపోయాయి. ఇతర పార్టీల సహకారం లేకుండా జాతీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజారిటీ సాధించడం మళ్లీ 2014లోనే జరిగింది. ఈ ఘనత నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీకి దక్కింది. అయితే, బీజేపీ దేశమంతా విస్తరిస్తూ వచ్చినా అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా బీజేపీ దారికి అడ్డం నిలబడ్డాయి. బీజేపీ విస్తరణను అడ్డకున్నాయి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చాలా రాష్ట్రాల్లోకి బీజేపీ ప్రవేశించేందుకు చాలా కష్టపడుతూ వస్తున్నది. అందుకే అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలతో తలపడలేక స్నేహం నెరపుతూ ఉంది. మరొక వైపు ప్రాబల్యం కుంచించుకుపోతున్నా దేశమంతా ఉనికి ఉన్న పార్టీ కాంగ్రెసు.

 
జాతీయ రాజకీయాలను ఈ రెండు పార్టీల చుట్టూర మాత్రమే తిరుగుతున్నాయి. ఈ రాజకీయ పరిభ్రమణాన్ని జాతీయ పార్టీ ఏర్పాటు చేసి కేసీఆర్ తన వైపు తిప్పుకోగలరా అనేది ఇపుడు పెద్ద ప్రశ్న. ఇంత సువిశాల భారతదేశంలో రెండేరెండు పార్టీలుండటం, అందునా ఒకటి పతనావస్థలో ఉండటం ఇపుడు చూస్తున్నాం. ఈ లెక్కన మరొక జాతీయ పార్టీకి చోటు ఉన్నట్లు అనిపిస్తుంది. కేసీఆర్ ప్రయత్నం ఈ కోణం నుంచి చూస్తే సరైన ప్రయోగమే అనిపిస్తుంది.

 
తెలంగాణ కేసీఆర్‌కు జాగా దక్కుతుందా?
కాంగ్రెస్ బలహీన పడిన చోటల్లా బీజేపీ చొచ్చుకురావడమో లేక ప్రాంతీయ పార్టీలు బలపడటమో జరుగుతూ ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో అయితే, కాంగ్రెస్ ఖాళీ చేసిన జాగాలోకి బీజేపీ దూరలేకపోయింది. అక్కడ మరొక ప్రాంతీయ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ వచ్చి నిలబడింది. ఇక అక్కడ కాంగ్రెస్ రాలేదు. బీజేపీకి మనుగడ లేదు. ఇలాంటి చోట కేసీఆర్‌ ప్రవేశించగలరా? తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమబంగాల్ వంటి చోట కాంగ్రెస్ లేదూ... బీజేపీ కూడా పెద్దగా లేదు. అక్కడ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలేవీ కాలుమోపకుండా అడ్డుకుంటున్నాయి. ఇలాంటి రాష్ట్రాలలో జాతీయ స్థాయికి విస్తరించాలన్న ప్రయత్నంలో ఉన్న ప్రాంతీయ పార్టీకి చోటు లేని పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కమాటలో చెబితే... కాంగ్రెస్ జాగాని ప్రాంతీయ పార్టీలో బీజేపీయో ఆక్రమించుకుని జెండా పాతేశాయి. అక్కడ మరొక కొత్త పార్టీకి చోటిచ్చే పరిస్థితే లేదు.

 
ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీని దిల్లీ నుంచి తరిమేసేందుకు టీఆర్ఎస్‌ను జాతీయ స్థాయికి తీసుకెళతానని అంటున్నారు. బీజేపీ తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటూనే, తన జాతీయ పార్టీకి చోటుకోసం కేసీఆర్ ఇపుడు ఇతర ప్రాంతీయ పార్టీలతో పోటీ పడాలి. ఇదొక చిత్రమైన పరిస్థితి. అందుకే ఇంతవరకు ముఖ్యంత్రి కేసీఆర్ చేసిన జాతీయపార్టీ ప్రకటనలేవీ తెలంగాణ బయట సంచలనం సృష్టించలేక పోయాయి. విజయదశమి రోజున ఆయన జాతీయ పార్టీ ఏర్పాటు చేశాకనైనా దుమారం లేస్తుందేమో చూడాలి.

 
పొరుగు ఆంధ్రాలో ఏమనుకుంటున్నారు?
పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో ఇప్పటికైతే, అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు మరొక పార్టీకి సూదిమొన మోపే జాగా కూడా ఇచ్చేలా లేవు. అక్కడ బీజేపీ సొంతంగా తలెత్తలేకపోతున్నది. బీజేపీ ఏదో పార్టీతో కలిసి నడవాల్సిందే. ఇదే పరిస్థితి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని 'జనసేన'ది. పదేళ్లవుతున్నా ఆ పార్టీ ఇంకా ప్రచారదశలోనే ఉంది. గత ఎన్నికల్లో ఒకే ఒక్కసీటు గెలుచుకుని అభిమానులను నిరుత్సాహపరించింది. ఇలాంటపుడు కేసీఆర్ జాతీయ పార్టీకి పొరుగు తెలుగు రాష్ట్రంలో చోటుదొరుకుతుందా? 'దొరకడం కష్టం' అని అనంతపురానికి చెందిన పొలిటికల్ సైన్స్ మాజీ అధ్యాపకుడు ఎ.చంద్రశేఖర్ అన్నారు. 'ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జాతీయ పార్టీలకు ఎలాంటి పాత్ర లేదు. కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి చూస్తే ఇది అర్థమవుతుంది. ఇలాంటి ఆంధ్రప్రదేశ్‌లో మరొక జాతీయ పార్టీకి ఎలా చోటు దొరుకుతుంది?' అని చంద్రశేఖర్ అన్నారు.

 
రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి వాదన మరొక విధంగా ఉంది. 'కేసీఆర్ జాతీయ పార్టీ కేవలం నినాదం మాత్రమే. ఆయన రాజకీయ లక్ష్యం తెలంగాణయే. తెలంగాణ ఎన్నికల్లో గెలించేందుకు మాత్రమే ఆయన జాతీయ నినాదం వాడుకుంటున్నారు. ఎందుకంటే తన ప్రత్యర్థి బీజేపీ. కాబట్టి జాతీయ నినాదమిస్తున్నారు. అదొక వ్యూహం. ఆయన ఏ రూపంలో కూడా ఆంధ్రలో ప్రవేశించలేరు. పోలవరం ప్రాజెక్టును, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఆపేందుకు ప్రయతిస్తున్నవ్యక్తిగా కేసీఆర్‌కు ఆంధ్రలో అపకీర్తి ఉంది. ఆయన్నిఇక్కడి ప్రజలు 'తెలంగాణ కేసీఆర్' గానే చూస్తారు తప్ప జాతీయ నాయకుడిగా చూడలేరు' అని మాకిరెడ్డి చెబుతున్నారు.

 
తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది?
తెలంగాణలో కేసీఆర్ జాతీయ పార్టీ మీద అభిప్రాయాలు చిత్రంగా ఉన్నాయి. దేశంలో ప్రధాని మోదీకి ప్రత్యామ్నయం కేసీఆరే అని ఆయన అభిమానులు కీర్తిస్తుంటే కేసీఆర్ జాతీయ పార్టీ పూర్తిగా డ్రామాగా తృణీకరించడం మరొక వైపు కనిపిస్తుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మహా క్లిష్టమైన చారిత్రక దశలోకి దేశం ప్రవేశించిందని, దీన్నుంచి బయటపడేందుకు కేసీఆర్ తనదైన అజెండాతో ముందుకు వస్తున్నారని, ఇది ఆహ్వానించాల్సిన పరిణామం అని కేసీఆర్ అభిమానులు చెబుతున్నారు. 'కాంగ్రెస్‌తో పాటు అనేక రకాల ఫ్రంటులు దేశ రాజకీయాల్లో విఫలమైనాయి. ఈ జాగాలోకి బీజేపీ ప్రవేశించి ఈ దేశాన్ని, సమాజాన్ని వినాశనం చేస్తున్నది. ఈ ప్రమాదం మధ్య దేశ భవిష్యత్తు కోసం కొత్త అజెండా అవసరం. ఈ కొత్త అజెండాతో కేసీఆర్ ముందుకు వస్తున్నారు. ఇది ఒక తప్పనిసరి చారిత్రకావసరం.

 
ఆయన తన మేనిఫెస్టో పూర్తిగా ప్రకటించకపోయినా అదెలా ఉండబోతున్నదో ఇప్పటికే తన ప్రసంగాల ద్వారా చెప్పకనే చెప్పారు. ఈ అజెండాకు దేశాన్ని అభివృద్ధి వైపు నడిపే శక్తి ఉందనిపిస్తుంది. అది తప్పక భావసారూప్యం గల శక్తులను, ప్రజలను ఆయన వెంట నడిపిస్తుంది' అని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్ అంటున్నారు. కేసీఆర్‌ను ఆయన స్వాప్నికుడిగా వర్ణిస్తూ... 'నాడు నెహ్రూ కన్నకలలనే తిరిగి ఇపుడు కేసీఆర్ కంటున్నారు. నెహ్రూ తర్వాత మన కాలంలో సాగుతున్న ఈ ఆలోచన ఫలించడం ఈ దేశానికి అవసరం' అని అశోక్ చెప్పారు.

 
అయితే, ఇతర అభిప్రాయాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ కూడా జాతీయ పార్టీగా మారే యోచనను ఆహ్వానిస్తూనే ఒక చిన్న హెచ్చరిక చేశారు. 'దేశంలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. అది మాకు సమ్మతమే. బీజేపీకి వ్యతిరేకంగా అనేక పార్టీలు, ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రయత్నాలను... కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం దెబ్బతీయకుండా ఉండాలి' అని నారాయణ అన్నారు. మరొక ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి జాతీయ పార్టీ అనేది ఉత్తిదే. ఉత్తుత్తి నినాదమే అని అంటున్నారు. 'వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ జాతీయ నినాదాలతో పోరాడాలనుకుంటున్నారు. ఎన్నిక ప్రాంతీయం, నినాదం జాతీయం. ఇది తప్ప కేసీఆర్ జాతీయ పార్టీకి జాతీయ అజెండా అనేదేమీ లేదు. అది కేవలం అసెంబ్లీ ఎన్నికల కోసమే.

 
బీజేపీ నుంచి ముప్పు గమనించే ఆయన గత ఎన్నికలపుడు ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. ఇపుడు జాతీయ పార్టీ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక కొత్త పార్టీ ఏర్పాటు ఆహ్వానించదగ్గ పరిణామమే. గతంలో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులైన చరిత్ర మనకు ఉంది. పూర్వం ప్రధానలైన చరణ్ సింగ్, మొరార్జీ, వీపీ సింగ్, దేవేగౌడ వంటి వారు ముఖ్యమంత్రులే. వీళ్లంతా ఒక జాతీయ పార్టీ ధోరణికి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రతిపక్ష ఐక్యత నుంచి వచ్చిన వారు. కానీ, కేసీఆర్ ఎవరినీ అసలు గుర్తించడమే లేదు. ఈ ధోరణితో ఒక జాతీయ లక్ష్యం సాధించడం ఎలా? అందువల్ల ఆయన తెలంగాణలో తన గెలుపుకోసం ఇలా ద్విముఖ నినాదం చేస్తున్నారనిపిస్తుంది. ఇందులో బీజేపీని దిల్లీ నుంచి తరిమేయాలనడం ఒక పార్శ్వం. ఇంతగా బీజేపీతో తలపడుతున్నందున తెలంగాణలో తననే మళ్లీ గెలిపించుకోవాలనుకోవడం రెండో పార్శ్వం' అని తెలకపల్లి రవి పేర్కొన్నారు.

 
కేసీఆర్ జాతీయ పార్టీ పైకి కనిపించేంత స్వచ్ఛమైన ఆలోచన కాదని, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి అభిప్రాయపడ్డారు. 'ఒకవైపు బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటే, దానిని కాదని జాతీయపార్టీ అనడం ఏమిటి? బీజేపీకి వ్యతిరేకమంటూనే మరొక పార్టీ ఏర్పాటు చేయడమంటే అంతిమంగా బీజేపీ వ్యతిరేక కూటమిని బలహీనపర్చడమే తప్ప మతతత్వ శక్తులను ఓడించే ప్రయత్నంగా కనిపించదు' అని డాక్టర్ మల్లు రవి అన్నారు.

 
'తెలంగాణ' ముద్ర మునికాళ్ల బంధమవుతుందా?
దేశమంతా బలమైన ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. బీజేపీ హిందుత్వ, హిందీ వాదానికి విరుగుడుగా చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ ఉనికి ప్రయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న గుర్తింపు కూడా బలమైన ప్రాంతీయ వాదమే. ఇరవైయేళ్లుగా ఆయనను తెలంగాణ ప్రాంతీయ నాయకుడిగా దేశం చూస్తూ వస్తున్నది. ఒక విధంగా ఆయన తెలంగాణకు రాజకీయ పర్యాయపదం అయ్యారు. ఇలాంటి ఒక తెలంగాణ నేతను అంతే బలమైన ప్రాంతీయ ముద్ర వేసుకున్నఇతర రాష్ట్రాల ప్రజలు తమ నేతగా స్వీకరించగలరా? తానే కట్టుకున్న ప్రాంతీయత కట్లు తెంచుకుని కేసీఆర్ జాతీయనేతగా ఎదగగలరా? తెలంగాణ ప్రాంతీయత అనేదే కేసీఆర్‌కు మునిగాళ్ల బంధమవుతుందా? ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన రాజనీతి శాస్త్ర మాజీ ఆచార్యులు కర్లి శ్రీనివాసులు ఇదే అనుమానం వ్యక్తం చేశారు.

 
'నరేంద్ర మోదీ కూడా గుజరాత్ ప్రాంతీయ నాయకుడే. ఆయనకు జాతీయ స్థాయి గుర్తింపు ఒక్క సారిగా రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ. మోదీ ఒక కొత్త పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ప్రధాని అభ్యర్థి అయ్యేనాటికి భారతీయ జనతా పార్టీ దేశంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా మారింది. అనేక రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేక రాష్ట్రాలలో బలమైన శక్తిగా ఉంది. మోదీ గుజరాత్ ప్రాంతీయ ముద్రని బలమైన జాతీయ పార్టీతో చెరిపేసుకున్నారు. కేసీఆర్ విజయవంతం కావాలంటే కూడా ప్రాంతీయ ముద్రని చెరిపేసుకుని జాతీయ స్థాయికి ఎదగాల్సి ఉంటుంది' అని ప్రొఫెసర్ శ్రీనివాసులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద పరిశోధన చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనిర్శిటీ రాజనీతి శాస్త్ర ఆచార్యులు డా.ఇ.వెంకటేశు కూడా కేసీఆర్‌కు చాలా బలమైన 'తెలంగాణ ముద్ర' ఉందని అది చెరిగి పోవడం అంత సులభం కాదని అన్నారు.

 
'కేసీఆర్‌కి జాతీయ నాయకుడిగా గుర్తింపు రావాలంటే ముఖ్యమైన రాష్ట్రాలలో పార్టీ సంస్థాగత నిర్మాణం ఉండాలి. ఎక్కడుంది? సంస్థాగత నిర్మాణం ఉన్నపుడే ఆ రాష్ట్రాల ప్రజలకు ఆయన చేరువ అయ్యేందుకు మార్గం ఏర్పడుతుంది. ఇది చాలా కష్టం. ప్రధాని మోదీకి బీజేపీ ఈ కొరత తీర్చింది. కేసీఆర్‌కు అలాంటి అవకాశం లేదు' అని వెంకటేశు అన్నారు. అయితే, తెలంగాణ ప్రాంతీయ ముద్ర అవరోధాన్ని అధిగమించేందుకు ఒక మార్గముందని, అది ఫెడరల్ ఫ్రంట్ అని ఆయన అన్నారు. 'జాతీయ స్థాయిలో ఫ్రంటుకి ప్రాంతీయ ముద్ర అడ్డు కాదు. అర్హత అవుతుంది. ఫ్రంటులో భాగస్వామి అయినపుడు పరోక్షంగా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మీకు మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. గత ఫ్రంటుల నేతలకు వారి రీజినల్, క్యాస్ట్ ఐడెంటిటీ అడ్డుకాక పోవడానికి కారణం వాళ్లు పార్టీగా విలీనం కాకుండా ఫ్రంటుగా ఏర్పడటమే. కేసీఆర్ 'తెలంగాణ ముద్ర' నుంచి బయపడకుండానే జాతీయ నాయకుడు కావాలంటే 'బీజేపీ వ్యతిరేక పార్టీ' కంటే 'బీజేపీ వ్యతిరేక ఫ్రంటు'లో భాగస్వామి కావడమే మంచి మార్గం' అని ప్రొఫెసర్ వెంకటేశు వివరించారు.