ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated: శనివారం, 17 సెప్టెంబరు 2022 (09:05 IST)

September 17: హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంపై బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధానికి కారణమేంటి?

Men
సెప్టెంబర్ 17, 1948 నాడు నాటి హైదరాబాద్ రాజ్యాన్ని 'పోలీస్ యాక్షన్' పేరు మీద జరిగిన సైనిక చర్య ద్వారా భారత సమాఖ్యలో కలిపారు. నేడు అది తెలంగాణ రాష్ట్ర రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల ఫలితాలని నిర్ణయించే ఒక ముఖ్యమైన అంశంగా ఇది ముందుకు రాబోతోంది అనేది సుస్పష్టం.
 
నేడు రాజకీయంగా, భావజాల పరంగా తీవ్ర వివాదాస్పద అంశగా మారిన విషయం: సెప్టెంబర్ 17....హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో విలీనమైన రోజా లేక హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం పాలకుల పాలన నుండి విముక్తి చేసిన రోజా అనేది.
 
బీజేపీ ఎప్పుడూ ఈ తారీఖుని విమోచన రోజుగా ముందుకు తీసుకురావాలి అనే ప్రయత్నాలలో ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజుని ఎలాంటి రోజుగా నిర్ధారించాలి అనేది ఒక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నట్టు కనిపిస్తోంది.
 
దక్షిణ భారత దేశంలోకి మరింతగా చొచ్చుకురావటానికి (కర్నాటక తరువాత వారి ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు) తెలంగాణను వాడుకోవాలి అని చూస్తున్న బీజేపీ తమ రాజకీయ కార్యకలాపాలని ఉధృతం చేసింది.
 
పార్టీ కేంద్ర స్థాయి నాయకులు తరుచుగా తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు. భారీ స్థాయి బహిరంగ సభలు, యాత్రలు, ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రస్తుతం ముగ్గురు శాసనసభ్యులు మాత్రమే ఉన్న బీజేపీ రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.
 
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నిజాం పాలన పట్ల విమర్శనాత్మక వైఖరితో టీఆర్ఎస్ ఉండేది. తెలంగాణ అస్థిత్వానికి గుర్తుగా సెప్టెంబర్ 17 తారీఖుని గుర్తించాలని అప్పట్లో పార్టీ డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తరువాత- 2014 తరువాత- తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తుంది.
 
ఎంఐఎం పార్టీతో టీఆర్ఎస్‌కి ఉన్న పొత్తు, రాష్ట్రంలో ముస్లిం వర్గాన్ని దూరం చేసుకోకూడదు అనే ఆలోచన, ఆలాగే ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని దీనిని హిందూ-ముస్లిం విషయంగా మార్చి తమ ప్రాబల్యం పెంచుకునే అవకాశం బీజేపీకి ఇవ్వకూడదు అనేవి ఈ వైఖరి వెనుక కారణాలుగా చెబుతున్నారు.
 
అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మద్దతుతో బీజేపీ ఈ విషయాన్ని సవాలుగా విసరడంతో.. 2014 నుంచి ఈ విషయం మీద మౌనంగా ఉన్న టీఆర్ఎస్ ప్రస్తుతం ఈ తారీఖుని 'తెలంగాణ జాతీయ సమైఖ్యత దినోత్సవం' గా జరపాలి అని నిర్ణయించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విమోచన దినోత్సవంగా కాకుండా సమైఖ్యత దినోత్సవంగా నిర్వహించడం.
 
నేపథ్యం
బ్రిటిష్ పాలనలో నాటి ఉపఖండంలో ఉన్న 584 సంస్థానాల్లో హైదరాబాద్ అన్నిటికన్నా పెద్దది. అందులో నేటి తెలంగాణ రాష్ట్రం, నేటి మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతం, నేటి కర్నాటకలోని నాలుగు కన్నడ భాష జిల్లాలు హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేవి.
 
హైదరాబాద్ రాజు ముస్లిం కాగా ఎక్కువ భాగం ప్రజలు హిందువులు. ఆయన పాలన ఒక వారసత్వ, రాచరిక, నిరంకుశ పాలన కావడంతో హైదరాబాద్ రాజ్యంలో పౌర, ప్రజస్వామ్య హక్కుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉండేది. ఉర్దూ రాజ్య భాష కావడంతో అత్యధికులు మాట్లాడే తెలుగు, కన్నడ, మరాఠీ భాషలకి ప్రభుత్వం నుండి గుర్తింపుగానీ, ప్రోత్సాహంగానీ ఉండేది కాదు.
 
నిజాం రాజ్యపు సామాజిక మద్దతుదారులుగా జాగీర్దారులు, దేశ్ ముఖ్‌లు, దేశ్ పాండేలు, భూస్వామ్య దొరలు ఉండేవారు. మొత్తం భూములలో 60% దివానీ లేదా ఖల్సా ఖాతా కింద ఉండేవి. వాటికి సంబంధించిన పన్ను వసూలు చాలా భాగం వరకు భూస్వామ్య దొరల చేతిలో, పట్వారీ, మాలీ పటేల్, పోలీస్ పటేల్‌గా పిలిచే రెవెన్యూ అధికారుల చేతులలో ఉండేది.
 
వీరందరూ చాలా వరకు హిందూ కరణం (బ్రాహ్మణ), రెడ్డి, వెలమ కులాలకి చెందినవారే. పాలక వర్గంలో ఉన్నత శ్రేణి, బ్యూరోక్రసీలో ముస్లిం ఉన్నత వర్గాలది గుత్తాధిపత్యం కాగా గ్రామీణ ప్రాంతం హిందూ భూస్వాముల అధీనంలో ఉండేది.
 
ఈ భూస్వామ్య వర్గమే నిజాం పాలనకు పునాది. చాలా మంది అనుకునేటట్టు కాకుండా నిజాం రాజు ఏనాడు కూడా ప్రజా వ్యహారాలలో ఇది మతోన్మాదం అనిపించే రీతిలో మతానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు.
 
ఈ నేపథ్యంలో, ప్రజల ఆకాంక్షలు, వారి సమీకరణాలు అనేక రూపాలు తీసుకున్నాయి. వీటి నుండి పుట్టుకొచ్చినవే ఆర్య సమాజ్, గ్రంథాలయ ఉద్యమం, రైతాంగ సాయుధ పోరాటం.
 
ఈ రైతాంగ సాయుధ పోరాటం, ప్రజా బాహుళ్య పోరాటాల నేపథ్యంలోనే హైదరాబాద్ పాలక వర్గం రజాకార్ల మద్దతుతో మతోన్మాద బాట పట్టింది. అయితే పైన చెప్పుకున్నట్టు నిజాంకు పునాదిగా నిలబడింది హిందూ భూస్వామ్య వర్గాలే. అటువంటి పరిస్థితులలో నిజాం పాలన అంతా కూడా ముస్లిం మతోన్మాద పాలన అని చెప్పడం అసంబద్ధమైన విషయం.
 
నిజాం పాలన ఎలా అంతమైంది?
భారత సమాఖ్య సైనిక చర్య కారణంగా నిజాం లొంగిపోయిన విషయం మీద ఆయా వర్గాల రాజకీయ, భావజాల అవగాహన బట్టి అనేక కథనాలు చలామణీలో ఉన్నాయి.
 
సెప్టెంబర్ 17కి సంబంధించి ఒక ఐదు రకాల కథనాలని మనం గుర్తించవచ్చు. దీనికి ఒక పాక్షిక కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న పరిణామాలు. ఇవి కూడా మారిన పరిస్థితుల కారణంగా కొత్త రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ ఐదు కథనాల వెనుక ఉన్న అవగాహనని మనం ఇప్పుడు చూద్దాం.
 
విలీనం అనే పదం మామూలు సందర్భంలో అయితే సాదాసీదా పదం. ఈ తారీఖు నాడు హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో భాగం అయ్యింది కాబట్టి ఈ పదం వాడటం మాములు విషయంగా అనిపిస్తుంది. అయితే ఈ విలీనమనే ఘటన వెనుక ఉన్న లోతైన రాజకీయాలు ఈ పదంలో ప్రతిబింబించవు కాబట్టి ఈ ప్రక్రియకి ఉన్న అనేకానేక అర్థాలకు, పర్యవసానాలకి అతీతంగా ఈ పదం నిలబడగలుగుతుంది.
 
బ్రిటిష్ వలస రాజ్యపు ఆధీనంలోనే ఉన్నప్పటికీ హైదరాబాద్ రాజ్యం ఒక స్వతంత్ర రాజకీయ వ్యవస్థ. హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో చర్చల ద్వారా కాకుండా సైనిక చర్య ద్వారా భాగం అయ్యింది కాబట్టి అది దురాక్రమణ అని ఒక భావన. ఈ భావన ప్రకారం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, సైనిక చర్య ద్వారా బలప్రయోగం జరపడం.
 
అయితే చేరిక అనే పదం నిజాం వైపు నుండి ఒక అంగీకారం ఉంది అనే భావనని తెలియచేస్తుంది. కమ్యూనిస్ట్ సాయుధ పోరాటానికి భారత సమాఖ్యకి మధ్యలో నిజాం నలిగిపోతున్నాడు కాబట్టి.. భారత సమాఖ్యలో చేరి ఆ సాయుధ పోరాటాన్ని అణిచివేసే బాధ్యత సమాఖ్యకి అప్పగించాడు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది.
 
విప్లవ వామపక్ష శిబిరంలో ఈ మొత్తం విషయానికి సంబంధించి వేరే అభిప్రాయం ఉంది. ఈ శిబిరానికి ఈ మొత్తం వ్యవహారం ఒక విద్రోహం. తెలంగాణ ప్రజలకి భూమి, భుక్తి, విముక్తిని నిరాకరిస్తున్న భూస్వామ్య వ్యవస్థను కూలదోయడానికి జరుగుతున్న రైతాంగ పోరాటాన్ని హింసాత్మకంగా అణిచి వేయడం కూడా దీనిలో భాగమని ఈ శిబిరం వాదన.
 
ఈ రైతాంగ పోరాటంలో పేద ముస్లిం రైతాంగం, కౌలుదారులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో బందగీ అనే ఆయన ముస్లిం భాగస్వామ్యానికి ప్రతీకగా నిలిస్తే మఖ్దూం మొహియుద్దీన్, ఆలం ఖుందిమిరీ లాంటి మేధావులు నిజాం వ్యతిరేక పోరాటానికి ప్రతీకలు.
 
అలాగే ఈ నిజాం వ్యతిరేక పోరాటంలో ఎంతో మంది ముస్లిం యువకులు, విద్యార్ధులు, మేధావులు భారీ సంఖ్యలో పాలుపంచుకున్నారు. ఈ రైతాంగ పోరాటాన్ని అణిచివేశాక జాగీర్దారి వ్యవస్థ రద్దు, కౌలుదారీ వ్యవస్థ సంస్కరణ, భూ సంస్కరణలు లాంటి అనేక వాగ్దానాలు, వాటి అరా కొర అమలు జరుగుతున్నా కూడా భూస్వాములు తిరిగి రావటం, భూస్వామ్య అధికార వ్యవస్థ మళ్లీ ఊపిరి పోసుకోవడం జరిగాయి.
 
రైతాంగ పోరాటానికి గాంధేయవాద జవాబుగా వచ్చిన భూదాన ఉద్యమం ప్రభావం నామమాత్రం, అలాగే తెలంగాణలో ఉన్న భారీ స్థాయి భూసమస్యని తీర్చడంలో భూదాన ఉద్యమం పాత్ర దాదాపుగా శూన్యం.
 
సామాజిక, వర్గ నేపథ్యంలో చూస్తే కనుక సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ ప్రజలకి, వారి ఆకాంక్షలకి ద్రోహం జరిగిన రోజు. ఎందుకు అంటే తెలంగాణ ప్రజల పోరాటాన్ని అణిచివేశారు, అలాగే ఈ అణిచివేత అనేది నిజాం, భారత సమాఖ్యల ప్రజా వ్యతిరేక, కమ్యూనిస్ట్ వ్యతిరేకతకి ప్రతీకగా చూడటం జరుగుతోంది.
 
అయితే అన్నిటికన్నా చాలా దూకుడుగా ప్రచారం చేస్తున్న వాదన మాత్రం బీజేపీ వాళ్లు చేస్తున విమోచన వాదం. వారి వాదన ప్రకారం సెప్టెంబర్ 17 అనేది హైదరాబాద్ రాజ్యంలోని హిందూ ప్రజలని ముస్లిం పాలన నుండి విముక్తి చేసిన రోజు.
 
బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ సంవత్సరం దీనిని 'హైదరాబాద్ రాజ్య విమోచన' పేరుతో సంవత్సరం పొడుగునా సంబరాలు జరపాలి అని నిర్ణయించింది. సెప్టెంబర్ 17, 2022 నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ 75 సంవత్సరాల వారోత్సవ సంబరాలని ప్రారంభిస్తున్నారు.
 
ఈ సంబరం అంతా కూడా రాబోయే రాష్ట్ర, జాతీయ ఎన్నికలకి సమాయత్త కార్యక్రమాలుగా చూడవలసిన అవసరం ఉంది. ముస్లిం పాలన నుండి విముక్తి అనే వాదన ప్రజల మధ్య మత విభజనలకి దారి తీస్తుందని, దాని పర్యవసానంగా హిందువులు తమ వైపు మళ్లి ఎన్నికలలో తమకి లబ్ధి జరుగుతుందనేది వారి ఆలోచన.
 
ఈ దూకుడు అధికార టీఆర్ఎస్, దాని మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీలని ఇరుకున పెట్టింది అనే చెప్పాలి. ఈ విషయం మీద మౌనంగా ఉన్న టీఆర్‌ఎస్ తన అభిప్రాయాన్ని చెప్పక తప్పలేదు. బీజేపీ దూకుడుకు జవాబుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ తారీఖుని 'తెలంగాణ సమైఖ్యత దినోత్సవంగా ' ప్రకటించి సెప్టెంబర్ 16 నుండి మూడు రోజుల పాటు వజ్రోత్సవ సంబరాలు జరపాలి అని నిర్ణయించింది.
 
బీజేపీ విమోచన వాదనకు తప్పక జవాబు చెప్పల్సివచ్చిన ఎంఐఎం కూడా ఈ తారీఖుని 'జాతీయ సమైఖ్యత దినోత్సవం' గా ప్రకటించాలని చెప్పి టీఆర్‌ఎస్‌కు వత్తాసు పలికింది.
 
సింబాలిక్ రాజకీయాలు
అయితే ఈ సెప్టెంబర్ 17 అనే రక్తికట్టే నాటకం అనేక లోతైన ప్రశ్నలని రేకెత్తిస్తుంది. దీనిని 'విమోచన' అని పిలవచ్చా? పిలవొచ్చు అనుకుంటే అలా పిలిస్తే ఉండే సామాజిక, ఆర్థిక, రాజకీయ పర్యవసానాలు ఏమిటి?
 
ఒక్క మాటలో చెప్పాలంటే, విముక్తి అంటే కేవలం ప్రభుత్వం మారటం మాత్రమే కాదు. విముక్తి అంటే సమాజం పూర్తిగా రూపాంతరం చెందటం. ఏ రకమైన చారిత్రక పరిశోధనని చూసినా కూడా సెప్టెంబర్ 17, 1948 నాడు హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో భాగం అయ్యిందని ఉంటుంది. దానికి కొనసాగింపుగా జనవరి 26, 1950 నాడు అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా హైదరాబాద్ ప్రజాస్వామ్య గణతంత్రమైన భారత దేశంలో భాగం అయ్యింది.
 
అయితే విముక్తి అనేటప్పుడు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. భూస్వామ్యం అంతానికి, కుల పెత్తనం నిర్మూలన కోసం ఎంతో సుదీర్ఘ పోరాటం జరిగింది. సెప్టెంబర్ 17తో ఈ రెండింటికీ తెరపడిందా? సెప్టెంబర్ 17 అనే ఒక ఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక విమర్శనాత్మక చారిత్రక దృక్పథం ఆధారంగా.. కులం, వర్గం, ఆధిపత్యం, అధికారం లాంటి ముఖ్యమైన అంశాలు చర్చలో భాగం అవ్వాలి.
 
ఘటనని వివరించటమే కాకుండా దానికి ఒక లోతుని, దాని పరిధిని విస్తరించడమే చరిత్ర ముందున్న ఒక ముఖ్యమైన కర్తవ్యం.
 
ఈ విమోచన వాదన అనేది పైన చెప్పిన అంశాల జోలికి ఏ మాత్రం వెళ్లకుండా సింబాలిజం దగ్గరే ఆగిపోయి, దానిని కేవలం మతానికి కుచించివేస్తుంది.
 
ప్రజాబాహుళ్యం, ముఖ్యంగా మధ్య తరగతి వర్గాలు, హిందువైజ్ అవుతున్న నేటి తరుణంలో మతపరమైన విషయం ఏదైనా కూడా లాభాలు తెచ్చిపెడుతుంది అనే భావన ఉంది.
 
అయితే దీనికి భిన్నంగా తెలంగాణ సమాజం మొత్తంగా కూడా గత అనేక దశాబ్దాలుగా మతసామరస్యంతో మెలుగుతూ, అసమానత, వ్యత్యాసాలు, అస్థిత్వం(ప్రాంతీయ అస్థిత్వం అందులో అత్యంత ముఖ్యమైనది) లాంటి అంశాల మీదనే చర్చిస్తున్నది, పని చేస్తున్నది.
 
దశాబ్దాల తరబడి జరిగిన తెలంగాణ ఉద్యమం విభిన్న మతాల, విభిన్న వర్గాల, విభిన్న కులాల సమాహారంగా జరిగిన ఒక లౌకిక, ప్రజాస్వామ్య, ప్రజా బాహుళ్య ఉద్యమానికి ప్రతీక. అటువంటి ఉద్యమం ఫలితమైన తెలంగాణ తన ఈ ప్రగతిశీల స్వభావానికి కట్టుబడి ఉంటుందా లేక మత ప్రభావంలో పడుతుందా అనేది వేచిచూడాల్సిన విషయం.