మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (17:14 IST)

తూచ్.. ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు : కల్వకుంట్ల కవిత

kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసినట్టు వైరల్ అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ వార్తల్లో రవ్వంత కూడా నిజం లేదని చెప్పారు. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్ ఇపుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ స్కామ్‌పై ఈడీ అధికారులు శుక్రవారం హైదరాబాద్, నెల్లూరులతో పాటు 40కి పైగా స్థానాల్లో సోదాలు చేశారు. ఈ సోదాలు జరిగిన గృహాల్లో కవిత వ్యక్తిగత ఆడిటర్ కూడా ఉన్నారని, అందువల్ల కవితకు కూడా ఈడీ అధికారులు ఆమె వ్యక్తిగత సహాయకుడి ద్వారా నోటీసులు జారీచేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వైరల్ అయ్యాయి.
 
ప్రస్తుతం కరోనా వైరస్ సోకి హోం ఐసోలేషన్‌లో ఉన్న కవిత ఈ వార్తలపై స్పందించారు. ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. తాను ఈ వాస్తవాన్ని వెల్లడించడం ద్వారా టీవీ ప్రేక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేయాలనుకుంటున్నానని తెలిపారు. 
 
ఢిల్లీలో కూర్చుని దుష్ప్రచారం చేస్తున్న కొందరు వ్యక్తులు మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసే కంటే వాస్తవాలనే ప్రచారం చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా సంస్థలన్నింటిని కోరుతున్నానని కవిత హితవు పలికారు.