ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: రివ్యూ రిపోర్ట్ ఇలా వుంది
నటీనటులు: సుధీర్ బాబు-కృతి శెట్టి-వెన్నెల కిషోర్-రాహుల్ రామకృష్ణ-అవసరాల శ్రీనివాస్-శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సాంకేతికత= ఛాయాగ్రహణం: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాతలు: మహేంద్రబాబు-కిరణ్ బొల్లపల్లి, రచన-దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ
కథానాయకుడు సుధీర్ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సినిమా కథలో డైరెక్టర్ రోల్ ప్లే చేసిన సుధీర్‌బాబు, నాయికగా నటించిన కృతిశెట్టితో ఇంద్రగంటి ఏంచెప్పాడో చూద్దాం.
కథ:
నవీన్ (సుధీర్ బాబు) ఫిలిం ఇండస్ట్రీలో ఐదు సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్న దర్శకుడు. కమర్షియల్ దర్శకుడిగా పేరుపొందిన ఆయన అనుకోని ఓ సంఘటనతో రియల్ కథను తీయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకోసం డాక్టర్ అలేఖ్య (కృతి శెట్టి)ని నాయికగా పెట్టి సినిమా తీయాలనుకుంటాడు. కానీ వారి కుటుంబానికి సినిమా ఫీల్డ్ అంటే అసహ్యం, కోపం కూడా. అటువంటి కుటుంబానికి చెందిన అలేఖ్యను ఫైనల్‌గా దర్శకుడు నవీన్ నటించడానికి ఒప్పిస్తాడు. అది ఎలా? అసలు ఎందుకని ఆ కుటుంబానికి సినిమా వాళ్ళంటే అసహ్యం? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
ముందుగా ఈ సినిమా కథ ఎలా పుట్టిందంటే, దర్శకుడు ఇంద్రగంటి కోటిలోని పాత పుస్తకాల దుకాణంలో ఓ పుస్తకాన్ని కొంటే అందులో ఓ అమ్మాయి ఫొటో కనిపించింది. ఆ ఫొటోనుబట్టి తను రీసెర్చ్ చేసి కథగా అల్లి సినిమా తీయడానికి కారణమైంది. ఒకరకంగా రియల్ కథే. ఈ పాయింట్‌ను తీసుకుని దర్శకుడు సినిమా తీయడమేకాక, సినిమారంగంలోని పోకడలపై బయటి వ్యక్తుల అభిప్రాయాలు తప్పనీ, చీప్ వార్తలు రాసి సినిమా వాల్ళపై దుస్ప్రచారం చేసే వెబ్‌సైట్లపై సెటైర్‌గా ఈ సినిమా వుంటుంది.
ఇంతకుముందు సుధీర్ బాబు-అదితి రావు హైదరి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన సమ్మోహనం అలాంటి సినిమానే. థియేటర్లలో ఓ మోస్తరుగానే ఆడిన ఈ చిత్రం.. టీవీ ఓటీటీ ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన తెచ్చుకుంది. క్లాసిక్ అనిపించుకుంది. మరలా అలాంటి ప్రయత్నం చేసిన దర్శకుడు ఈసారి సినిమారంగంపై గౌరవం కలిగించే ప్రయత్నం చేశాడు. పాయింట్ చిన్నదే కావడంతో స్లో నెరేషన్‌తో సాగడం, కుటుంబంలోని ఎమోఫన్స్ పండించడంతో కథనంతో లాక్కువచ్చాడు.
చక్కటి ప్రేమకథ, ఫీల్‌గుడ్ సన్నివేశాలతో సాగే ఈ సినిమా బలమైన పాత్రలు హీరోహరోయిన్లతోపాటు హీరోయిన్ కుటుంబం కూడా. ఎవరికీ తెలీని ఆ కుటుంబంలోని అమ్మాయి గురించి, ఓ నిర్మాత వల్ల దర్శకుని జీవితం ఏవిధంగా నాశనం అయింది అనేది కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఒకరకంగా సినిమా రంగంలో అసిస్టెంట్ దర్శకులు ఎదుర్కొంటున్న సమస్యతు, వర్థమాన తారలు ఎదుర్కొంటున్న ఒత్తిడిలు ఇందులో క్లారిటీ చూపించాడు.
ఇలాంటి కథలు ఓటీటీకి బాగా ఉపకరిస్తాయి. థియేటర్ వరకు రావాలంటే ఫీల్ గుడ్ వున్న ఫ్రేక్షకులు కనెక్ట్ అవుతారు. చిన్నచిన్న లోపాలున్నా గుడ్ ప్రయత్నంగా చెప్పవచ్చు. హీరోయిన్ పాత్రకు ఇచ్చిన ట్విస్టు ఆ సమయానికి ఆసక్తికరంగా అనిపించినా.. ఆ ట్విస్టు తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగి ఉంటుందో చాలా ఈజీగా చెప్పేయొచ్చు. విషాదభరితంగా సాగే ఫ్లాష్ బ్యాక్ సాగతీతగా అనిపిస్తుంది. అవసరాల శ్రీనివాస్ పాత్ర నేపథ్యంలో కొన్ని సీన్లు రిలీఫ్ ఇస్తాయి. ముగింపులో హీరోయిన్ని పెట్టి హీరో తీసిన సినిమా స్క్రీనింగ్ నేపథ్యంలో నడిపిన క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది.
నటుడిగా సుధీర్‌బాబుకు ప్లస్ అయిన సినిమా. కృతిశెట్టి చక్కగా నటించింది. ఇంద్రగంటి కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. శ్రీకాంత్ అయ్యంగార్.. కళ్యాణి ప్రియదర్శిని బాగానే చేశారు. మిగతా నటీనటులంతా ఓకే. టెక్నికల్‌గా చెప్పాలంటే, ప్రేమకథకు పాటలు చాలా కీలకం. ఈ విషయంలో సంగీత దర్శకుడు వివేక్ సాగర్ నిరాశపరిచాడు. కమర్షియల్‌గా ఎంతబాగా పే చేయడంకంటే ఓ ఫీల్ కలిగించే చిత్రమిది.