శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (13:41 IST)

సీఎం కేసీఆర్ వినాశనానికే ఇదంతా చేస్తున్నారు : ఈటల మండిపాటు

etala rajender
అసెంబ్లీ సమావేశాలు ముగిసేంతవరకు తనను సస్పెండ్ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వినాశనానికే ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు. యేడాది కాలంగా తనపై కుట్రలు చేస్తున్నారని, ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచినప్పటి నుంచి తనను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దింపేంత వరకు విశ్రమించబోనని స్పష్టం చేశారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. 
 
మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, స్పీకర్ పోచారం శ్రీనివాసులు రెడ్డిని ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ మర మనిషి అంటూ సంబోధించారు. దీంతో ఈటలను ఈ సమావేశాలు ముగిసేంత వరకు ఈటలను సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో ఈటల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు వాహనం ఎక్కేందుకు ఆయన నిరాకరించారు. తన సొంత వాహనంలోనే వెళ్తానని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ఈటలను బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించి, శామీర్‌పేటలోని ఆయన ఇంటి వద్ద వదిలిపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. బానిసల మాదిరిగా బతకొద్దని సూచించారు.