ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (11:50 IST)

అది పాదయాత్ర కాదు.. ఉన్మాదయాత్ర.. అడ్డుకునితీరుతాం : తమ్మినేని సీతారాం

tammineni seetharam
రాజధాని అమరావతి రైతులు సోమవారం నుంచి చేపట్టిన మహాపాదయాత్రపై వైకాపా నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇలాంటి వారిలో రాష్ట్ర శాసనసభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం కూడా ఒకరు. తాను అసెంబ్లీ సభాపతిని అనే కనీసం జ్ఞానం కూడా లేకుండా ఈ మహాపాదయాత్రపై విమర్శలు గుప్పించారు. అది పాదయాత్ర కాదని, ఉన్మాద యాత్ర, అంతిమ యాత్ర అంటూ మండిపడ్డారు. పైగా ఈ యాత్రను అడ్డుకుని తీరుతామంటూ హెచ్చరించారు. 
 
అమరావతి ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు మహాపాదయాత్రను సోమవారం నుంచి చేపట్టారు. ఇది అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకు సాగనుంది. ఈ యాత్ర సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. 
 
ఒక్క అధికార వైకాపా మినహా మిగిలిన రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. దీనిపై తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, ఉత్తరాంధ్రపై పాదయాత్ర అసమర్థులు చేస్తున్న అంతిమయాత్ర అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఉత్తరాంధ్రకు రాజధాని వద్దని చేస్తున్న యాత్ర ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి చేస్తున్న ఉన్మాద యాత్ర అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి యాత్రకు ఎవరు అనుమతి ఇస్తారు అంటూ తమ్మినేని సీతారాం అన్నారు. 
 
ఒకే రాజధాని ఉడంటం వల్ల అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమవుతుడటం వల్ల విభజన సమయంలో ఎంత నష్టపోయామో మీకు తెలియదా? అంటూ నిలదీశారు. మూడు రాజధానులతో రాష్ట్రమంతటా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకరుగా ఈ విధంగా మాట్లాడే హక్కు తనకు ఉందని చెప్పారు.