1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 29 అక్టోబరు 2019 (18:04 IST)

వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?

ఫోటో కర్టెసీ: INSTITUTE OF ARCHAEOLOGY, PRAGUE
పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాగ్ కసెల్‌లో బయటపడ్డ 10వ శతాబ్దపు అస్థిపంజరపు జాతి గుర్తింపు కోసం దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ, ఈలోపే ఆ అవశేషాన్ని తమ సైద్ధాంతిక ప్రయోజనాల కోసం నాజీలు, సోవియట్లు దోపిడీ చేశారు. అయితే, వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆ అస్థిపంజరం ఏ జాతి వారిదని తెలుసుకునే క్రమంలో దాని గురించి కంటే మన గురించిన వివరాలే ఎక్కువ తెలిశాయి.

 
ఆ అస్థిపంజరం తల ఎడమ వైపుకు ఉంది, అతని కుడి చేయి ఇనుప కత్తి మీద విశ్రాంతి తీసుకుంటుంది. అతని ఎడమ చేతిలో ఒక జత కత్తులు ఉన్నాయి. అతని వేళ్లు వాటిని తాకినట్లుగా కనిపిస్తున్నాయి. అతని మోచేయి మీద నిప్పు వెలిగించే చెకుముకి రాయిలాంటిది ఉంది. అతని పాదాల వద్ద ఒక చిన్న చెక్క బకెట్ అవశేషాలు ఉన్నాయి. అది ఒకప్పుడు వైకింగ్స్ (10వ శతాబ్దపు స్కాండనేవియన్ సముద్రపు దొంగలు, వ్యాపారులను వైకింగ్స్ అంటారు) మద్యపానం కోసం ఉపయోగించిన పింగాణి పాత్రలా ఉంది. తల వద్ద ఇనుప గొడ్డలి ఉంది. అయితే, ఒక మీటర్ పొడవుతో ఉన్న 10 శతాబ్దాపు తుప్పుపట్టిన ఆ యోధుడి కత్తి మనల్ని ఆకర్షిస్తుంది.

 
అతను వైకింగా?
చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని మధ్యయుగ పురావస్తు శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ ఫ్రోలిక్ మాట్లాడుతూ ''అతని కత్తి చక్కటి నాణ్యతతో ఉంది, బహుశా పశ్చిమ ఐరోపాలో తయారై ఉండొచ్చు'' అని పేర్కొన్నారు. ఈ రకమైన కత్తిని ఉత్తర ఐరోపా, ఆధునిక జర్మనీ, ఇంగ్లండ్, మధ్య ఐరోపాలోని వైకింగ్స్‌తో పాటు ఇతరులు ఉపయోగించారు.

 
''అతని వద్ద ఉన్న వస్తువుల్లో ఎక్కువ భాగం వైకింగ్‌లు వాడేవే ఉన్నాయి. కానీ అతని జాతీయత ఏమిటనేది ప్రశ్నార్ధకమే'' అని ఫ్రోలిక్ చెప్పారు. ఉక్రేనియన్ పురావస్తు శాస్త్రవేత్త ఇవాన్ బొర్కోవస్కీ 1928 లో ప్రాగ్ కసెల్‌లో ఈ అస్థిపంజరాన్ని వెలికి తీశారు. అప్పటి నుంచి ఇది చరిత్రకారులను ఆశ్చర్యపరిస్తోంది, గందరగోళానికి గురిచేస్తోంది.

 
ఈ తవ్వకాలు రష్యన్ అంతర్యుద్ధం సమయంలో దేశం నుంచి బహిష్కరణకు గురైన బొర్కోవస్కీ ఆధ్వర్యంలోనే జరిగాయి. కానీ, అతను ప్రాగ్ నేషనల్ మ్యూజియంలో పురావస్తు విభాగాధిపతి అయినప్పటికీ తన సొంత తీర్మానాలను ప్రచురించకుండా ఆంక్షలు ఎదుర్కొన్నారు.

 
నాజీలు, సోవియట్ల పోరాటం
1939లో నాజీలు ప్రాగ్‌ను ఆక్రమించినప్పుడు, వారు వైకింగ్ సిద్ధాంతాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎందుకంటే ఇది జాతి పేరుతో జర్మన్ చెప్పే కథనానికి చక్కగా సరిపోతుంది. వైకింగ్స్ కూడా నార్డిక్ జాతివారే కాబట్టి వారు జర్మన్లు అని ఆ దేశం వాదిస్తుంది. వైకింగ్స్ తిరగాడిన నేల తమదేనని చెబుతుంది. జర్మన్ జాతి కేవలం తమకు చెందిన పురాతన భూమిని తిరిగి ఆక్రమించుకుంటుందన్న హిట్లర్ ఆలోచనను ఈ సిద్ధాంతం బలోపేతం చేసింది.

 
జర్మన్లు తనను నిర్బంధ శిబిరానికి పంపుతారనే భయంతో బొర్కోవస్కీ నాజీ అకాడెమియా చెప్పినట్లు నడుచుకున్నారు. జర్మన్ చారిత్రక వాదనలను సమర్థించడానికి అనువుగా తన రచనలను భారీగా సవరించి ప్రచురించారు. యుద్ధం తర్వాత ప్రాగ్‌పై సోవియట్ ప్రభావం మరింత పెరిగింది. దీంతో బొర్కోవెస్కీ తన రచనల్లో మళ్లీ మార్పులు చేయాల్సి వచ్చింది. వైకింగ్‌లు జర్మనీ వారనే వాదనపై ఆయన యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది.

 
వాస్తవానికి ఈ అస్థిపంజరం స్లావ్ ప్రీమిస్లిడ్ రాజవంశంలోని ఒక ముఖ్యమైన వ్యక్తికి సంబంధించినది. ఈ వంశం బోహేమియాను 400 ఏళ్లకు పైగా 1306 వరకు పరిపాలించింది.

 
ఈ అస్థిపంజరం ఏ జాతికి చెందినది?
70 ఏళ్ల తరువాత ప్రొఫెసర్ ఫ్రోలిక్ వంటి పురావస్తు శాస్త్రవేత్తలు సిద్ధాంతాల మీద కాకుండా సైన్స్ ఆధారంగా తమ అభిప్రాయాలను చెప్పడానికి స్వేచ్ఛ లభించింది. "అతను(ఈ అస్థిపంజరం) ఇక్కడ బోహేమియాలో పుట్టలేదని తెలుసు. ఆ యోధుడి పన్నులోని స్ట్రాటియం రేడియోధార్మిక ఐసోటోపులను విశ్లేషణ చేస్తే అతను ఉత్తర ఐరోపా వాసిగా తేలింది. అతని జన్మస్థానం బాల్టిక్ సముద్ర దక్షిణ తీరం, బహుశా డెన్మార్క్ అయిఉండొచ్చు'' అని ఫ్రొలిక్ తెలిపారు.

 
అది వైకింగ్ భూభాగమా?
దీనికి ఫ్రొలిక్ సమాధానమిస్తూ ''అవును, కానీ అతను బాల్టిక్‌లో పుట్టినందువల్ల వైకింగ్ అవుతాడని కాదు. అప్పటికీ బాల్టిక్ దక్షిణ తీరంలో స్లావ్‌లు, బాల్టిక్ తెగలు నివసిస్తున్నాయి'' అని చెప్పారు. అతను ఉత్తరం నుంచి వచ్చి ఉంటాడని, సుమారు 50 ఏళ్ల వయస్సులో చనిపోయి ఉంటాడని పేర్కొన్నారు.