శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 29 జులై 2023 (12:51 IST)

కళ్ల కలక ఎందుకు వస్తుంది? ఈ కంటి ఇన్‌ఫెక్షన్ రాకూడదంటే పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

Eye flu
కొన్ని రోజులుగా కళ్ల కలకల(కంజంక్టివైటిస్) కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ సమస్య ఎలా వస్తుంది, దీనికి చికిత్స ఏమిటి, ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కండ్ల కలకలు ఉన్న వారి కళ్లల్లోకి చూడడం వల్ల అది వ్యాప్తి చెందుతుందని కొందరు చెబుతుంటారు. ఇందులో ఎలాంటి నిజమూ లేదు. ఆ వ్యాధి కారక సూక్ష్మజీవులు ఎదుటి వ్యక్తికి చేతి ద్వారా, లేదా ఏదైనా వస్తువు ద్వారానే వ్యాపిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాలు అధికంగా పడే సమయంలో ఈ కంటి ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.
 
ఎందుకు వస్తుంది?
కండ్ల కలక అనేది వైరస్ లేదా బ్యాక్టీరియా లేదా ఏదైనా అలర్జీ వల్ల కలుగుతుంది. వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చే కలకలు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా పాఠశాలల్లో పిల్లలకు ఒకరి నుంచి ఒకరికి, లేక గుంపుగా ఉన్న ప్రదేశాల్లో అధికంగా ఇది వ్యాప్తి చెందుతుంది. అలర్జీ వల్ల కలిగేది ఆ వ్యక్తి రోగ నిరోధక వ్యవస్థ మీద మాత్రమే ఆధార పడి ఉంటుంది. వైరస్ లేదా అలర్జీ వల్ల కలిగేది తక్కువ సమయంలో తీవ్రమైన లక్షణాలతో వస్తుంది. కానీ తేలికగా తగ్గిపోతుంది.
 
బ్యాక్టీరియా వల్ల కలిగేది కొన్ని రోజుల వ్యవధిలో పెరుగుతుంది. కానీ, కన్ను మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. దీని వల్ల చూపు కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. కొన్ని సార్లు, కొన్ని రసాయనాల వల్ల కూడా కళ్ల కలకలు రావచ్చు. అప్పుడు శుభ్రమైన నీటితో కళ్లను కడగడం వల్ల అది తగ్గిపోతుంది. లక్షణాలు తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యులను కలవాలి. ఇంటి చిట్కాలు అంటూ ఆలస్యం చేస్తే సమస్య తీవ్రం అయ్యే అవకాశం ఉంది.
 
వ్యాప్తి ఎలా జరుగుతుంది?
ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి నుంచి ఆ వైరస్ ఇతర వ్యక్తులకు కంటి స్రావాలు, చేతుల ద్వారా చేరుతుంది. ఎక్కువ శాతం, తెలిసీ తెలియక చేతులు కళ్లలో పెట్టుకోవడమే ప్రధాన సమస్య. ఒక వ్యక్తి ముక్కులో లేదా సైనస్‌లో ఉండే వైరస్, బాక్టీరియా ఇతరుల కళ్లలోకి చేరడం వల్ల ఇన్ఫెక్షన్ కలిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉండేవారికి వ్యాధి తీవ్రత అధికమయ్యే అవకాశం ఉంటుంది. కాంటాక్ట్ లెన్స్ వాడే అలవాటు ఉన్న వారు వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, లేక సరైన లెన్స్ వాడక పోవడం వల్ల కూడా ఇవి రావచ్చు. స్కూల్‌లో లేదా జన సమూహంలో గడిపే వారికి కళ్ల కలకలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 
కళ్ల కలక లక్షణాలు ఏమిటి?
ఒక కన్ను లేక కళ్లు ఎర్రగా అవ్వడం
కళ్లలో మంట, నొప్పి, లేక దురద
కను రెప్పలు వాపు రావడం
కంటి రెప్పలు అతుక్కోవడం (ముఖ్యంగా పొద్దున లేచేసరికి ఎక్కువ ఊసులతో కను రెప్పలు అతుక్కొని ఉండడం కనిపిస్తుంది.)
ఎక్కువ వెలుగు చూడలేక పోవడం
కళ్ల నుంచి నీరు లేక చిక్కటి ద్రవం కారడం
బ్యాక్టీరియా వల్ల కలిగిన కళ్ల కలకలో చీము వచ్చే అవకాశం ఉంది. ఆ ఇన్ఫెక్షన్ కను గుడ్డులో వ్యాప్తి చెందితే చూపు పోయే ప్రమాదం ఉంది.
కళ్ల కలకలకు కారణమైన వైరస్ వల్ల సాధారణ జలుబుకు కూడా వస్తుంటుంది
చిన్న పిల్లల్లో జ్వరం వంటి లక్షణాలు కూడా కలుగవచ్చు
 
చికిత్స ఏమిటి?
ఈ లక్షణాలు కనిపించినప్పుడు కళ్లు నలపడం లేదా కంట్లో చేతులు పెట్టడం చేయకూడదు.
శుభ్రమైన టిష్యూ లేక కర్చీఫ్ వాడి కళ్లు తుడుచుకోవాలి.
నల్లటి అద్దాలు పెట్టడం వల్ల లక్షణాల నుంచి కొంత ఉపశమనం లభించవచ్చు.
కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వారు వెంటనే వాటి వాడకం ఆపేయాలి.
వైరస్ వల్ల కలిగే సమస్య సాధారణంగా ఒకటి రెండు వారాలలో తగ్గిపోతుంది.
బ్యాక్టీరియా వల్ల కలిగిన సమస్య అయితే, ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి, సరైన మందు సరైన మోతాదులో, తగినన్ని రోజులు తప్పకుండా వాడాలి.
 
నివారణ ఏమిటి?
ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఈ సమస్య రాకుండా నివారించడానికి చేతులు తరుచూ శుభ్రంగా కడుక్కోవాలి.
తరుచూ కళ్లను ముట్టుకోడం మానేయాలి. కళ్లద్దాలు వాడడం వల్ల కళ్లు ముట్టుకోవడం తగ్గి, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.
ఈ సమస్య ఉన్నప్పుడు జనంలో తిరగడం, స్విమ్మింగ్ పూల్స్ వాడడం వంటివి మానుకుంటే మంచిది.
కళ్ల కలకలు ఉన్న వారు వాడిన టవల్స్, కర్చీఫ్ లేదా చద్దర్లు ఇతరులు వాడకూడదు.
ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు స్కూల్‌కు పంపకుండా, వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
సొంత వైద్యంతో ఆలస్యం చేయకుండా సమస్య చిన్నగా ఉన్నప్పుడే వైద్యుల సలహా మేరకు పూర్తి చికిత్స తీసుకోవడం మంచిది.