శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 27 జులై 2023 (22:16 IST)

హైదరాబాద్ యువతి అమెరికాలో ఎంఎస్ చదివేందుకు వెళ్లి రోడ్డు పక్కన దీనస్థితిలో కనిపించారు, అసలేం జరిగింది?

image
అమెరికాలోని షికాగోలో ఒక యువతి రోడ్డుపై దీనస్థితిలో ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీన్ని హైదరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఖలీకర్ రెహ్మాన్ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో కనిపించిన యువతి తన పేరు మిన్హాజ్ జైదీ.. అని చెబుతున్నారు. ఆమెకు చాలా రోజుల నుంచి సరిగా తిండి, నిద్ర లేనట్లుగా కళ్లు లోపలికి వెళ్లినట్లు కనిపిస్తున్నాయి. చాలా నీరసంగా కనిపిస్తూ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. తన పేరు అడుగుతున్నా సరిగా చెప్పలేకపోతున్నారామె. ఆమె జుట్టంతా చెదిరిపోయింది. బ్లాక్ జాకెట్ వేసుకుని, నల్ల రంగు దుప్పటి కప్పుకున్నారామె. వీడియోలో మరోవైపు నుంచి మాట్లాడుతున్న వ్యక్తి ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ.. ఆమె సరిగా సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఆమె మాట పూర్తిగా తడబడుతోంది.
 
ఎవరీ యువతి..?
ఆమెది హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతం. పూర్తి పేరు సైదా లులు మిన్హాజ్ జైదీ (37). ఆమె తల్లి పేరు సైదా వహాజ్ ఫాతిమా. ఆమె రిటైర్డ్ ఉపాధ్యాయిని. దాదాపు 35 ఏళ్లపాటు తార్నాకలోని ఐఐసీటీ క్యాంపస్ స్కూల్ లో సైన్స్, ఇంగ్లీషు పాఠాలు చెప్పారు. ప్రస్తుతం ఇంటి వద్దనే ట్యూషన్లు చెబుతున్నారు. మిన్హాజ్ జైదీ హైదరాబాద్‌లోని షాదాన్ కాలేజీలో 2017లో ఎంటెక్‌ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. ఆ తర్వాత అదే కళాశాలలో రెండేళ్లపాటు కాంట్రాక్టు పద్ధతిలో కంప్యూటర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అయితే, కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆమెకు ఉద్యోగం పోయింది. దీంతో ఉన్నత చదువులు చదవాలని మిన్హాజ్ నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై మిన్హాజ్ తల్లి ఫాతిమా బీబీసీతో మాట్లాడారు. ‘‘ఎంఎస్ చేస్తే మంచి ఉద్యోగాలు వస్తాయని అనుకుంది. అందుకే లాక్డౌన్ సమయంలో చాలా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసి ఆన్‌లైన్‌లో పరీక్షలు రాసింది. ఎంఎస్ చేస్తే ఉద్యోగంలో తీసుకునేప్పుడు ఎక్కువ వెయిటేజీ ఇస్తారని నాతో చెప్పింది.’’ అని అన్నారు.
 
మరో రెండు నెలల్లో కోర్సు పూర్తవుతుందనుకుంటే...
2021లో మిన్హాజ్ జైదీకి డెట్రాయిట్ లోని ట్రైన్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సైన్స్‌ విభాగంలో ఎంఎస్ సీటు వచ్చింది. అదే ఏడాది ఆగస్టులో ఎఫ్ 1 వీసాపై అమెరికాకు వెళ్లారు. చదువు నిమిత్తం వీసా పరిమితి ఐదేళ్ల కాలానికి ఉంది. మిన్హాజ్ చిన్నప్పట్నుంచి బాగా చదువుకుందని, మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకునేదని ఫాతిమా బీబీసీతో అన్నారు. రెండు నెలల కిందట వరకు ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఒక్కసారిగా ఏమైందో తెలియదని చెప్పారు. కుమార్తె మిన్హాజ్ దీనస్థితి చూసి తల్లి ఫాతిమా తీవ్ర వేదన చెందారు. ‘‘మిన్హాజ్ తో మాట్లాడి రెండు నెలలవుతోంది. ఏమైందో.. ఎక్కడికి వెళ్లిందో ఎంత విచారించినా తెలియరాలేదు. రెండు నెలలుగా ఎంబసీతో మాట్లాడుతూనే ఉన్నా. చివరికి అలా కనిపించింది’’ అని ఫాతిమా బీబీసీతో చెప్పారు.
 
‘‘ఆమె వద్ద ఉన్న వస్తువులు, సర్టిఫికెట్లు, ఇతర పత్రాలన్నీ ఎవరో తీసుకున్నారని అక్కడి వారు సమాచారం ఇచ్చారు. ఫోన్ కూడా లేదు. అవన్నీ ఏమయ్యాయో తెలియదు. ఆమె ఆరోగ్యం సరిగా లేదు. ఆసుపత్రిలో చేర్పించేందుకు ఇండియన్ ఎంబసీ సహకరించాలి. ఆమె వద్ద బ్యాగులోనే ఇన్సూరెన్స్ కార్డు ఉండాలి’’ అని ఫాతిమా అన్నారు.
 
ఇంతకీ ఏం జరిగినట్లు..?
రెండు నెలల కిందట వరకు మిన్హాజ్ జైదీ బాగానే మాట్లాడినట్లు ఫాతిమా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మిన్హాజ్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేక డిప్రెషన్ లోకి వెళ్లి ఉండొచ్చని అమెరికాలోని తెలుగు ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై షికాగోలో ఉంటున్న సామాజిక కార్యకర్త మహమ్మద్ మిన్హాజ్ అక్తర్‌తో బీబీసీ మాట్లాడింది. ‘‘అమెరికా వచ్చే విద్యార్థులు తమ ఖర్చుల కోసం చిన్నాచితకా ఉద్యోగాలు చేయక తప్పడం లేదు. ప్రతి సెమిస్టర్‌కు ఖర్చు పెరుగుతోంది. డబ్బు సంపాదనలో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అబ్బాయిలు ఏదైనా ఉద్యోగం చేస్తారు. అమ్మాయిలు కొన్ని ఉద్యోగాలు మాత్రమే చేయగలరు. అందుకే ఇక్కడ ఉండేందుకు అవస్థలు పడుతున్నారు. చదువు కొనసాగించలేక డిప్రెషన్‌లోకి వెళుతున్నారు.
 
గత ఏడాది మిన్హాజ్ జైదీ మా ఆఫీసుకు వచ్చినప్పుడు కొన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించా.ఆమె వద్ద ఉన్నఎఫ్1 వీసాతో ఇక్కడ పనిచేసేందుకు వీలుండదు. డిప్రెషన్ లోకి వెళ్లేంతగా పరిస్థితి ఉందని అనుకోలేదు. రెండు రోజుల కిందట ఆమె కనిపించినప్పుడు మానసిక స్థితి సరిగా లేనట్లు కనిపించింది. ఆమె ఆరోగ్యంగా లేదు’’ అని అక్తర్ చెప్పారు.
 
ఇండియా తీసుకురావడం ఎలా..?
మిన్హాజ్ జైదీని భారత్ కు పంపించేందుకు తెలంగాణ తెలుగు అసోసియేషన్ సహా పలు సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికాలోని బీబీసీ ప్రతినిధితో ఆయా సంఘాల ప్రతినిధులు చెప్పారు. ఆమె వీడియోను సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తున్నారు. ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని అసోసియేషన్ల ప్రతినిధులు కోరుతున్నారు. ‘‘ఆమెను భారత్‌కు పంపించేందుకు ఇబ్బంది ఉండదు. కానీ, ఆమె వద్ద ఉన్న పాస్‌పోర్టు పాడైపోయింది. ఇండియా కాన్సులేట్‌తో నేను మాట్లాడినప్పుడు గంటలో పాస్‌పోర్టు ఏర్పాటు చేయగలమని చెప్పారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. సైకాలజిస్టులతో ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించాల్సి ఉంటుంది. ఎవరికైనా ఆమె కనిపిస్తే నాకు సమాచారం ఇవ్వండి’’ అని మిన్హాజ్ అక్తర్ చెప్పారు.
 
భారత విదేశాంగ శాఖ మంత్రికి లేఖ
మిన్హాజ్ జైదీ పరిస్థితిపై ఆమె తల్లి ఫాతిమా ఈ నెల 22వ తేదీన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. డిప్రెషన్‌కు లోనై షికాగో రోడ్లపై తన కుమార్తె ఆకలితో అలమటిస్తోందని అందులో రాశారు. గత రెండు నెలల నుంచి కూతురు తనతో మాట్లాడలేదని ఆమె చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు గుర్తించి చెప్పడంతో కూతురు పరిస్థితి తెలిసిందని చెప్పారు. ఆమె వస్తువులను ఎవరో దొంగిలించారని, తీవ్ర ఒత్తిడితో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలిసిందన్నారు. కూతురు విషయంలో ఇండియన్ ఎంబసీ, ఇండియన్ కాన్సులేట్ జోక్యం చేసుకోవాలని కోరారు.
 
తన కూతురిని భారత్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు ఎంబసీతో మాట్లాడాలని కేంద్ర మంత్రిని ఫాతిమా లేఖలో కోరారు. మిన్హాజ్ జైదీని కనుక్కోవడంలో అమెరికాలోని సామాజిక కార్యకర్త మహమ్మద్ మిన్హాజ్ అక్తర్ సాయం చేస్తారని ఆమె చెప్పారు. ‘‘మిన్హాజ్ జైదీ కనిపించడం లేదని ఇండియన్ ఎంబసీతో రెండు నెలలుగా మాట్లాడుతున్నా. అక్కడి నుంచి ఎలాంటి సమాచారం లేదు’’ అని బీబీసీతో ఫాతిమా చెప్పారు. ఆమె దగ్గర ఫోన్ లేకపోవడంతో ఆచూకీ తెలుసుకోలేకపోతున్నామని అంటున్నారు ఫాతిమా. మిన్హాజ్‌కు వెంటనే సరైన వైద్యం చేయించి భారత్ పంపించాలని తల్లి ఫాతిమా కోరారు. ఆమె రాలేని పరిస్థితిలో ఉంటే తనకు వీసా ఇచ్చి అమెరికాకు పంపించాలని ఫాతిమా అభ్యర్థించారు.