పెసలు నానబెట్టుకుని ముద్దలా చేసి..?
ప్రతీ స్త్రీ ఎక్కడికి వెళ్లినా.. వెళ్ళక పోయినా.. వారి సౌందర్యాన్ని మరింతగా పెంచుకోవాలని ఆరాటపడుతుంది. అందుకోసం బయటదొరికే ఫేస్‌ప్యాక్, ఇతర పదార్థాలు వాడుతుంటారు. వీటి వాడకం వలన చర్మం అందాన్ని కోల్పోయిందని సతమతమవుతుంటారు. మరి అందుకు ఏం చేయాలంటే.. ఇంట్లోని సహజసిద్ధమైన పదార్థాలతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఓసారి చూద్దాం..
పుదీనా ఆకులు:
ఈ ఆకులు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనా ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. ఈ ఆకులను ముద్దలా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉండి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే.. ముఖం చర్మం మృదువుగా తయారవుతుంది.
పెసలు:
వీటిని తరచు తినడం వలన శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. మరి సౌందర్య సాధనకు ఎలా ఉపయోగపడుతాయో చూద్దాం.. వీటిని బాగా నానబెట్టుకుని ముద్దలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆపై వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన చర్మరంధ్రాల్లో బ్యాక్టీరియాతో పాటు మొటిమలు కూడా తగ్గుతాయి.
బియ్యం నీరు:
చాలామంది మహిళలు ఇంట్లోని బియ్యం కడిగిన నీటిని పారబోస్తుంటారు. ఈ నీటి ప్రయోజనాలు తెలుసుకుంటే.. ఇలా చేయాలనిపించదు. 2 స్పూన్ల బియ్యం నీటిలో కొద్దిగా పసుపు కలిసి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి.. తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తుంటే.. ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.