దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో హాజరైన అమరరాజా గ్రూప్ కో-ఫౌండర్, ఛైర్మన్ శ్రీ జయదేవ్ గల్లా
అమరరాజా గ్రూప్ కో-ఫౌండర్, ఛైర్మన్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు లోక్‌సభ సభ్యులు శ్రీ జయదేవ్ గల్లా దావోస్‌లో ఈ వారం జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరమ్ యొక్క అత్యున్నత వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. మే 23 నుంచి మే 26వ తేదీ వరకూ జరిగిన ఈ సదస్సు ఆర్ధిక క్యాలెండర్‌లో జరిగే అతిపెద్ద కార్యక్రమాలలో ముఖ్యమైనది. ప్రపంచ దేశాల అధినేతలు, ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ ముఖ్యలు ఈ సదస్సులో పాల్గొంటుంటారు.
భారతదేశంలో సీనియర్ పరిశ్రమ నాయకునిగా, శ్రీ గల్లా జయదేవ్ తరచుగా దావోస్ సదస్సుకు హాజరవుతుంటారు. ఆయన పలు జాతీయ, అంతర్జాతీయ నాయకులతో అత్యున్నత సమావేశమయ్యారు. వీరిలో భారతదేశంలో పలు రాష్ట్రాల మంత్రులు సైతం ఉన్నారు. వీరు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.
అక్కడ ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల కలుగుతున్న నష్టాలు, విద్యుత్ సంక్షోభం, పెరుగుతున్న నిత్యావసరాలు నుంచి విద్యుత్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, లిథియం-అయాన్ బ్యాటరీ తయారీలో అమరరాజా ప్రయాణం గురించి మాట్లాడారు.
ఈ విషయాలను గురించి శ్రీ గల్లా మరింత విపులంగా మాట్లాడుతూ, ఈవీ స్వీకరణలో వృద్ధి కారణంగా నూతన విద్యుత్ వనరులైనటువంటి లిథియం-అయాన్ బ్యాటరీలకు పెరుగుతున్న డిమాండ్ గురించి వెల్లడించారు. అమరరాజా త్వరలోనే ఆర్ అండ్ డీలో తమ నూతన ఆవిష్కరణలను వాణిజ్య తయారీ దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దీనిలో భాగంగా ఈ గ్రూప్ పలు నూతన ఎనర్జీ స్టార్టప్స్‌లో భారతదేశంతో పాటుగా విదేశాలలో కూడా పెట్టుబడులు పెట్టిందన్నారు.
ఆయన చెప్పినట్లుగా, కంపెనీ దాదాపు ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాబోయే 5-10 సంవత్సరాల కాలంలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ సామర్థ్యం మెరుగుపరిచేందుకు పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళిక చేసింది. ఆయన వరుసగా పలు రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొనడంతో పాటుగా పెట్టుబడులను ఆకర్షించడంలో విధానాల ప్రభావం(ఇంపాక్ట్ ఆఫ్ పాలసీ ల్యాండ్‌స్కేప్ ఆన్ ఎట్రాక్టింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్) చర్చలో ప్యానలిస్ట్‌గా ఉన్నారు.
శ్రీ గల్లా మాట్లాడుతూ, మనమిప్పుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఈ ప్రపంచం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటోంది. వీటిలో విద్యుత్ సంక్షోభం, ఇన్‌పుట్ వ్యయం గణనీయంగా పెరగడం, ఉక్రెయిన్ యుద్ధం వంటివి ఉన్నాయి. వీటి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమలలో సరఫరా పరంగా అవరోధాలు ఏర్పడుతున్నాయి. దావోస్‌లో జరుగుతున్న ఈ సదస్సులో ప్రపంచంలో అత్యుత్తమ మేధావులు, ఆలోచనాపరులను ఒకే చోటకు తీసుకురావడంతో పాటుగా ఈ సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తోందని ఆశిస్తున్నాము.
ఇటీవలి కాలంలో చమురు ధరలు పెరగడం వల్ల ప్రయాణ ఖర్చులు మొదలు విద్యుత్, ఆహార ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. వీటికి తోడు అసాధారణ వాతావరణ పరిస్థితులు పెరుగుతుండటంతో గతానికంటే మిన్నగా విద్యుత్ భద్రత కావాల్సి ఉంది. దీనితో పాటుగా పునరుత్పాదక విద్యుత్ స్వీకరణ సైతం వేగవంతం కావాల్సి ఉంది. వ్యక్తిగతంగా, అమరరాజా గ్రూప్ వద్ద మేము సస్టెయినబిలిటీకి కట్టుబడి ఉన్నాము. భారతదేశపు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకోవడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుండటం పట్ల గర్వంగా ఉన్నాము అని అన్నారు.