మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (19:30 IST)

హెల్మెట్ ఉంటేనే పెట్రోల్... ఎక్కడ?

దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగుళూరు నగరంలో నానాటికీ ట్రాఫిక్ పెరిగిపోతోంది. ఈ కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు బెంగుళూరు నగర ట్రాఫిక్ పోలీసులు వివిధ రకాలైన ఆంక్షలను, ట్రాఫిక్ నిబంధనలను ప్రవేశపెట్టి, వాటిని అమలు చేస్తున్నారు.
 
ఈ క్రమంలో మరో కొత్త ఆంక్షలను ప్రవేశపెట్టారు. ఇకపై హెల్మెట్ ఉంటేనే బైక్‌లకు పెట్రోల్ పోయాలంటూ ఆదేశాలు జారీచేశారు. లేనిపక్షంలో పెట్రోల్ పోయొద్దని కోరారు. ఈ నిబంధన ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. బెంగళూరులో రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతున్న వారిలో బైక్ నడుపుతున్న వారు ఉన్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హెల్మెట్ రూల్ మస్ట్  చేశారు. హెల్మెట్ ధరిస్తే ప్రమాద సమయాల్లో ప్రాణాలు కాపాడుకోవచ్చని చెబుతున్నారు. 
 
ఇదే అంశంపై బెంగుళూరు ఈస్ట్ ట్రాఫిక్ డీసీపీ కేవీ జగదీష్ స్పందిస్తూ, 'శనివారం(ఆగస్టు 3,2019) నగరంలోని అన్ని పెట్రోల్ బంకుల యజమానులతో మీటింగ్ పెడతాము. సోమవారం(ఆగస్టు 5,2019) నుంచి నిబంధన అమలు చేస్తాము. పెట్రోల్ బంకుల్లో పని చేసే వారిపై ఎలాంటి ఒత్తిడి  చేయము. మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన పనికి సహకారం ఇవ్వాలని కోరతాము' అని చెప్పారు. 
 
బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల లెక్కల ప్రకారం.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా టూవీలర్స్ కారణంగానే జరుగుతున్నాయి. 2018లో టూ వీలర్ ప్రమాదాల్లో 150మంది చనిపోయారు. 2017తో పోలిస్తే 10 శాతం ఎక్కువ. 2019 జూలై నాటికి 105 మంది చనిపోయారు. హెల్మెట్ ధరిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు సురక్షితంగా బయటపడే ఛాన్స్ 42 శాతం వరకు ఉందని, 69 శాతం వరకు గాయాల నుంచి తప్పించుకోవచ్చని యూఎన్‌వో లెక్కలు చెబుతున్నాయిని గుర్తుచేశారు. అందువల్ల హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తామని తెలిపారు.