30, 31 తేదీల్లో బ్యాంకుల సమ్మె... నిలిచిపోనున్న లావాదేవీలు
తమ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు దిగనున్నారు. ఈ సమ్మె బుధవారం, గురువారం (మే 30, 31 తేదీల్లో) జరుగనుంది. ఈ సమ్మె మొత్తం 48 గంటల పాటు కొనసాగనుంది.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు దిగనున్నారు. ఈ సమ్మె బుధవారం, గురువారం (మే 30, 31 తేదీల్లో) జరుగనుంది. ఈ సమ్మె మొత్తం 48 గంటల పాటు కొనసాగనుంది. ఈ సమయంలో ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా పని చేయదు. మళ్లీ బ్యాంకులు తెరుచుకునేది వచ్చే శుక్రవారమే.
నెల చివరిలో రెండు రోజులు బ్యాంకులు పనిచేయకపోవటంతో.. జూన్ 1, 2 తేదీల్లో జీతాలు చెల్లింపులోనూ కొంత ఆలస్యం కానుంది. దీంతో పలు సంస్థలు తమ ఉద్యోగులకు మంగళవారమే జీతాలను డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది.
కాగా, బ్యాంక్ ఉద్యోగుల జీతాల పెంపుపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీసం 5శాతం జీతాల పెంపును డిమాండ్ చేయగా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేవలం 2 శాతం మాత్రమే పెంచటానికి అంగీకరించింది. దీంతో ఉద్యోగులు సమ్మె బాటపట్టారు.
ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ మద్దతు ప్రకటించాయి. ఈ కారణంగా ప్రభుత్వ బ్యాంకుల్లో రెండు రోజుల పాటు పూర్తిగా లావాదేవీలు స్తంభించిపోనున్నాయి.