సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (10:30 IST)

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. 30 వరకు విమాన సర్వీసులు రద్దు

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోమారు అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుండటంతో ఈ నెలాఖరు వరకు విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. నిజానికి ఈ నెల 14వ తేదీతో దేశంలో లాక్‌డౌన్ ముగియనుంది. అయినప్పటికీ.. ఎయిర్ ఇండియా మాత్రం నెలాఖరు వరకు విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. 
 
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతూనే వుంది. పైగా, ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్‌తో ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపరాదని నిర్ణయించింది. దేశంలో లాక్‌డౌన్ ఏప్రిల్ 14వతేదీతో ముగియనున్నా ఎయిర్ ఇండియా మాత్రం ఏప్రిల్ 30వతేదీ వరకు విమాన సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయించడం సంచలనం రేపింది. 
 
మరోవైపు, ప్రైవేట్ విమానయాన సంస్థలైన ఇండిగో, స్పైస్ జెట్, గోఎయిర్ విమానయాన సంస్థలు మాత్రం తమ దేశీయ విమాన సర్వీసులను ఏప్రిల్ 15 నుంచి నడిపేందుకు వీలుగా టికెట్ల బుకింగ్‌ను ప్రారంభించాయి. అయితే అంతర్జాతీయ విమాన సర్వీసులు మాత్రం మే 1వ తేదీ నుంచి నడపాలని ఇతర విమాన యాన సంస్థలు యోచిస్తున్నాయి. 
 
అయితే, ఎయిర ఇండియా తీసుకున్న నిర్ణయం ఇపుడు గుబులు రేపుతోంది. ఈ నెల 14వ తేదీతో లాక్‌డౌన్ ముగుస్తున్నా ఎయిర్ ఇండియా మాత్రం ఏప్రిల్ 30వ వరకు విమాన సర్వీసులు నడుపబోమని ప్రకటించడం వెనుక ప్రభుత్వ వ్యూహమేమైనా ఉందా అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే, లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.