ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్

డిస్నీని సొంతం చేసుకోనున్న రిలయన్స్ ... డీల్‌పై త్వరలో అధికారిక ప్రకటన

Disney
అమెరికాకు చెందిన వినోద సంస్థ డిస్నీకి చెందిన భారతీయ వ్యాపార కార్యకలాపాలను ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూపు సొంతం చేసుకోనుంది. ఈ రెండు సంస్థల మధ్య వ్యాపార విక్రయ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. డిస్నీ సంస్థను విక్రయించే నిమిత్తం అమెరికా కంపెనీ గత కొన్ని రోజులుగా ఆసక్తి-స్థోమత కలిగిన పలువురు పెట్టుబడిదార్లతో ఆ సంస్థ చర్చలు జరుపుతూ వచ్చింది. ఇందులో రిలయన్స్ సహా అదానీ గ్రూప్, సన్టీవీతోనూ చర్చలు జరిపింది. అయితే, డిస్నీ వ్యాపారాన్ని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కొనుగోలు చేయబోతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో ఈ లావాదేవీ జరిగే అవకాశం ఉందని 'బ్లూమ్ బర్గ్' పేర్కొంది.
 
డిస్నీ స్టార్ వ్యాపారంలో నియంత్రిత వాటాను రిలయన్స్‌కు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 బిలియన్ డాలర్లకు విక్రయించాలని డిస్నీ భావిస్తుండగా.. రిలయన్స్ 7, 8 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు సుముఖంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెల దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. రిలయన్స్ మీడియా యూనిట్లు సైతం ఇందులో విలీనం అయ్యే అవకాశం ఉందని తెలిపాయి. కొంత నగదు, షేర్ల బదిలీ రూపంలో ఈ డీల్ జరిగే అవకాశం ఉందని సమాచారం.