శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2023 (22:33 IST)

దేశంలో రికార్డు స్థాయిలో బంగారం స్మగ్లింగ్ కేసులు

gold coins
దేశంలో బంగారం స్మగ్లింగ్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పెద్ద ఎత్తున బంగారం పట్టుబడినట్లు కేంద్రం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. 
 
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు 3,917.52 కిలోల బంగారాన్ని సీజ్ చేసి 4,795 కేసులు నమోదు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌధురి సమాధానమిచ్చారు. 
 
ఈ సందర్భంగా 2020 నుంచి బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించి నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. 2022లో 3,502.16 కిలోల బంగారాన్ని సీజ్ చేసి 3,982 కేసులు నమోదు చేశామన్నారు. 
 
అలాగే 2021లో 2,383 కిలోల బంగారాన్ని సీజ్ చేసి 2,445 కేసులు నమోదు చేశారు. 2020లో 2,155 కిలోల అక్రమ బంగారాన్ని సీజ్ చేసి 2,567 కేసులు నమోదు చేశారు.
 
బంగారం స్మగ్లింగ్‌ను నియంత్రించేందుకు కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేయడమే కాకుండా అక్రమ బంగారం స్మగ్లింగ్ ముఠాల కార్యకలాపాలపై నిఘా ఉంచి ఇతర ఏజెన్సీల సమన్వయంతో పని చేయనున్నారు. 
 
ఈ స్మగ్లింగ్‌లో విదేశీయులు భారతీయులతో సిండికేట్‌గా ఏర్పడిన ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ 2020 నుంచి ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదయ్యాయని పంకజ్ చెప్పారు.