ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (07:35 IST)

దేశంలో మిగిలే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇవే...

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ బ్యాంకులను కూడా ప్రైవేటుపరం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా, ఇప్పటికే పలు బ్యాంకులను విలీనం చేసింది. ఈ నేపథ్యంలో మున్ముందు మరిన్ని బ్యాంకులను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఫలితంగా ప్రస్తుతం దేశంలో 12కు పైగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులు కేవలం సగానికి తగ్గిపోనున్నాయి. అంటే కేవలం ఆరు బ్యాంకులు మాత్రమే మిగలనున్నాయి. మిగతా ఆరింటిని కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ప్రైవేటీకరించనున్నట్లు తెలిసింది. కొత్త పెట్టుబడుల ఉపసంహరణ విధాలంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు బ్యాంకింగ్‌ సేవలను వ్యూహాత్మక రంగాల జాబితాలో చేర్చింది. 
 
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు గత విలీన ప్రక్రియల్లో భాగమైన బ్యాంకులను మినహాయించి, మిగతా వాటన్నింటినీ ప్రైవేటీకరించాల్సిన పీఎస్‌బీల జాబితాలో చేర్చినట్లు సమాచారం. అందులో రెండు పీఎస్‌బీలను వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో ప్రైవేటీకరించనున్నారు. 
 
దీంతో భవిష్యత్‌లో దేశంలో మిగిలనున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను పరిశీలిస్తే, భారతీయ స్టేట్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంకులు మాత్రమే ఉంటాయి.