13 నుంచి నాలుగు రోజుల పాటు బ్యాంకుల సెలవు
దేశంలోని బ్యాంకులన్నీ ఈ నెల 13వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం కావడంతో ఎప్పటిలానే మూతపడతాయి. కానీ, సోమ, మంగళవారాల్లో కూడా బ్యాంకు తలపులు తెరుచుకోవు. ఎందుకంటే.. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు రెండు రోజుల బంద్‌కు పిలుపునివ్వడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో 15, 16 తేదీల్లో కూడా బ్యాకులు మూతపడనున్నాయి.
ఇటీవల మరో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు యూనియన్ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే, బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేసినా, లేదంటే యూనియన్లు సమ్మె ప్రతిపాదనను ఉపసంహరించుకుంటే తప్ప ఈ నాలుగు రోజులూ బ్యాంకులు మూతపడడం పక్కా అన్నమాటే.
అయితే, ఊరట కలిగించే అంశం ఏమిటంటే.. బ్యాంకులు మూతలో ఉండే ఈ నాలుగు రోజులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకాలు ఉండకపోవడమే. బ్యాంకులు నాలుగు రోజులు మూతపడతాయి కాబట్టి ఏటీఎంలలో నగదు నిల్వలు కూడా కరిగిపోవచ్చు. కాబట్టి అత్యవసరంగా నగదు అవసరమయ్యేవారు ముందుగా మేల్కొనడం మేలు.