గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్

అపార్ట్‌మెంట్ రెసిడెన్స్ అసోసియేషన్స్ జీఎస్టీ చెల్లించాలా? వద్దా?

gstimage
గతంలో ఒక అపార్ట్‌మెంట్ అంటే మహా ఆయితే, నాలుగైదు అంతస్తులకు మాత్రమే పరిమితమై ఉండేది. వీటిలో కనీస అవసరాలు మాత్రమే ఉండేవి. కానీ మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజల అభిరుచుల్లో మార్పులతో పాటు బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో వివిధ సదుపాయాలు ఉండే బహుళ అంతస్తుల భవనాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీటిలో సకల సౌకర్యాలు ఉంటాయి., దీంతో అనేక మంది ఈ తరహా అపార్టుమెంట్ జీవనశైలికే మొగ్గు చూపుతున్నారు. 
 
బిల్డర్‌ తాను అపార్ట్‌మెంట్‌ కట్టే సమయంలో అన్ని సౌకర్యాలు కల్పించినా ఆ తర్వాత వాటిని మెయింటెయిన్‌ చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే అపార్ట్‌మెంట్‌లో నివసించే వారు ఒక సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దీన్ని రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ లేదా సొసైటీగా వ్యవహరిస్తారు.
 
ఈ అసోసియేషన్‌ పని ఏమిటంటే అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని పనులు అంటే.. సెక్యూరిటీ, లిఫ్ట్‌, కామన్‌ ఏరియా, పార్క్‌లు, ఆట స్థలాలు మొదలైన వాటిని చూసుకుంటుంది. దీనిలో అపార్ట్‌మెంట్‌లోని అందరూ.. సభ్యులుగా వ్యవహరిస్తారు. నెలవారీ ఖర్చుల కోసం ప్రతి సభ్యుడి నుంచి కొంత మొత్తం మెయింటెనెన్స్‌ చార్జీల కింద వసూలు చేస్తారు. మరి ఇలా వసూలు చేసే మెయింటెనెన్స్‌ చార్జీల మీద ఆయా సంక్షేమ సంఘాలు జీఎస్‌టీ చెల్లించాలా? చెల్లించాల్సి వస్తే దాని విధివిధానాలు ఏమిటి? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి.
 
ముందుగా రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌ జీఎస్‌టీ చెల్లించాలా అంటే.. ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. తమ సభ్యుల ద్వారా వసూలు చేసే మొత్తం.. సంవత్సరానికి రూ.20 లక్షలు దాటనంత వరకు ఆయా సంక్షేమ సంఘాలకు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ అవసరం లేదు. ఒకవేళ ఆ మొత్తం రూ.20 లక్షలు దాటితే రిజిస్ట్రేషన్‌ తప్పకుండా తీసుకోవాలి. ఇంకా సభ్యుడి నుంచి వసూలు చేసే నెలవారీ మెయింటెనెన్స్‌ చార్జీ నెలకు రూ.7,500 మించకపోతే ఎలాంటి జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు.