గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 మే 2023 (15:36 IST)

రూ.2 వేల నోట్ల మార్పిడికి ఎలాంటి ధృవపత్రాలు అక్కర్లేదు : ఎస్.బి.ఐ

sbi currency note
ప్రస్తుతం దేశంలో చెలామణిలో ఉన్న రెండు వేల రూపాయల నోటును భారత రిజర్వు బ్యాంకు రద్దు చేసింది. అయితే, ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న రూ.2 వేల నోటును మార్చుకునేందుకు సెప్టెంబరు నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. అయితే, ఈ నోట్ల మార్పిడిపై ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే నోట్లను మార్చుకునే సమయంలో ఫారం నింపాల్సి ఉంటుందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఏదైనా గుర్తింపు ధృవపత్రాన్ని కూడా సమర్పించాలని కొందరు అంటున్నారు. అయితే, వీటిపై తాజాగా బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు స్పష్టతనిచ్చింది. 
 
రూ.2 వేల నోట్లు మార్పిడికి ఎలాంటి పత్రం నింపాల్సిన అవసరం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. రూ.20 వేల వరకు బ్యాంకులో నేరుగా మార్చుకోవచ్చని తెలిపింది. అలాగే ఎలాంటి ఐడీ ప్రూఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. 
 
నోట్ల మార్పిడి సమయంలో రిక్విజషన్ ఫారం నింపాల్సి ఉంటుందని.. దానికి ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డులు ప్రూఫ్గా సమర్పించాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్బీఐ ఈ విషయంపై స్పష్టత నిచ్చింది. ఈ మేరకు అన్ని బ్యాంకు శాఖలకు ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్.మురళీధరన్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
చలామణి నుంచి రూ.2,000 నోటును ఉపసంహరిస్తూ శుక్రవారం ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ నోట్లు ఉన్న ప్రజలు వాటిని ఈనెల 23 నుంచి సెప్టెంబరు 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని వెల్లడించింది. 'క్లీన్ నోట్ పాలసీ' కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.