గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (17:33 IST)

అప్పులు ఎగ్గొట్టడం పెద్ద నేరమా? : గుజరాత్ డైమండ్ వ్యాపారి

చేసిన అప్పులు తిరిగి చెల్లించలేకపోవడం పెద్ద నేరం కాదని డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ అంటున్నాడు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన ఈ డైమండ్ వ్యాపారి... దేశంలోని పలు బ్యాంకుల నుంచి 13 వేల కోట్ల రూపాయల మేరకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టి పారిపోయాడు. ఇలా అప్పులు ఎగ్గొట్టి పారిపోవడం తప్పు కాదని సెలవిస్తున్నాడు. 
 
పైగా, తన వ్యక్తిగత జల్సాల కోసం అప్పులు చేయలేదనీ అవన్నీ కేవలం పౌర లావాదేవీలేనని చెప్పుకొచ్చాడు. ఇంత చిన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేస్తున్నారంటూ మండిపడ్డాడు. ఈ మేరకు ఆయన కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. 
 
పరారీరో ఉన్న ఆర్థికనేరస్థుడుగా ప్రకటించే విషయమై జరుగుతున్న విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టుకు మోడీ తరఫున ఆయన న్యాయవాది ఆ అఫిడవిట్‌ను సమర్పించాడు. మోడీ తన మామ మెహుల్ చోక్సీతో కలిసి బ్యాంకులకు టోపీ పెట్టారని ఆరోపణలున్నాయి. 
 
ఈ ఆరోపణల నేపథ్యంలో మోడీ లండన్‌కు, మెహుల్ చోక్సీ కరీబియన్ దేశమైన యాంటిగ్వా-బార్బుడోస్‌కు పారిపోయారు. రెండు దేశాలకు భారత్ అప్పగింత విజ్ఞాపనలను పంపింది. కొత్తగా తెచ్చిన ఆర్థికనేరాల చట్టం కింద మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడుగా ప్రకటించిన కేంద్ర సంస్థలు ఇప్పుడు మోడీపై దృష్టి నిలిపాయి. 
 
కానీ తనను పరారీలో ఉన్న ఆర్థికనేరస్థుడుగా ప్రకటించరాదని మోడీ తన అఫిడవిట్‌లో విజ్ఞప్తి చేశారు. భద్రత కారణాల రీత్యా తాను భారత్‌కు రాలేకపోతున్నట్టు నీరవ్ మోడీ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నాడు.