శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 3 జనవరి 2019 (18:11 IST)

ప్రభాస్‌ను భూకబ్జాదారుడు అంటారా..? టి.ప్రభుత్వ న్యాయవాదికి మరో మొట్టికాయ

బాహుబలి హీరో ప్రభాస్‌పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రీల్ లైఫ్‌లో విలన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న బాహుబలికి.. రియల్ లైఫ్‌లో విలన్లు ఎలా వుంటారో తెలియకపోయి వుండవచ్చునని హైకోర్టు వ్యాఖ్యానించింది. 
 
ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ వ్యవహారంపై విచారణ సందర్భంగా హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. కబ్జా చేసిన ప్రాంతంలో ప్రభాస్ గెస్ట్ హౌస్ వుందని.. ఆ గెస్ట్ హౌస్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన నేపథ్యంలో హైకోర్టు గురువారం ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించింది.
 
విచారణ సందర్భంగా ప్రభాస్ భూకబ్జాదారుడంటూ ప్రభుత్వ లాయర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవేళ ఎవరైనా భూమిని కబ్జా చేస్తే సెక్షన్ 17 కింద నోటీసులు ఇచ్చి.. విచారణ జరపాలని.. అలా చేయకుండా భూకబ్జాదారుడంటూ వ్యాఖ్యానించడం సబబు కాదని హైకోర్టు లాయర్‌కు హితవు పలికింది. 
 
ప్రభాస్ తరపు లాయర్ వాదిస్తూ.. ఆ భూమిని ప్రభాస్ కొనుగోలు చేశారన్నారు. కొనుక్కున్న ప్రాంతంలోనే గెస్ట్ హౌస్ కట్టుకున్నారని తెలిపారు. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.