సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (14:11 IST)

రూ.2 వేల నోట్లు మార్పిడిలో రూల్స్ పాటించాల్సిందే : ఆర్బీఐ గవర్నర్

ShaktikantaDas
క్లీన్ నోట్ పాలసీలో భాగంగా, రూ.2 వేల నోటును ఉపసంహరించుకున్నామని, అయితే ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30వ తేదీ వరకు గడువు ఇచ్చినట్టు భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. బ్యాంకుల్లో రూ.2 వేల నోటును మార్పిడి చేసుకునే సమయంలో ఎప్పటిలానే రూల్స్ పాటించాల్సిందేనని ఆయన తెలిపారు. 
 
రూ.2 వేల నోటు ఉపసంహరణపై ఆయన స్పందించారు. కరెన్సీ మేనేజ్‌మెంట్‌లో భాగంగా, ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. క్లీన్ నోట్ పాలసీని ఆర్బీఐ ఎప్పటి నుంచో అమలు చేస్తుందన్నారు. వివిధ డినామినేషన్ల నోట్లలో కొన్ని సిరీస్‌లను ఆర్బీఐ అపుపడుపూ ఉపసంహరించుకుంటుందని, కొత్త సిరీస్‌లను విడుదల చేస్తుందని చెప్పారు. అలాగే, ఇపుడు రూ.2 వేల నోటును ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. 
 
అయితే, నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ల విషయంలో ఇప్పటివరకు అవలంభిస్తున్న నిబంధనలే వర్తిస్తాయని తెలిపారు. పెద్ద మొత్తంలో అయ్యే డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందని, ఈ విషయంలో బ్యాంకులకు నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయని, వాటినే ఇపుడు బ్యాంకులు కూడా అమలు చేస్తాయని తెలిపారు.