సేవింగ్ ఖాతాలపై స్టేట్ బ్యాంకు బాదుడే బాదుడు...
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులపై భారాన్ని మోపేందుకు సిద్ధమైంది. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ భారం మోపేందుకు శ్రీకారం చుట్టనుంది.
ఎస్పీఐ బ్యాంకుల్లో ఉండే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాల ఛార్జీలను జూలై 1 నుంచి ఎస్‌బీఐ సవరిస్తుంది. వీరి ఉచిత నగదు ఉపసంహరణ (విత్‌డ్రాయల్స్) సదుపాయాన్ని నెలకు గరిష్టంగా నాలుగుకు మాత్రమే పరిమితం చేస్తోంది.
ఆ పరిమితి మించితే ప్రతి నగదు ఉపసంహరణపైనా రూ.15 ప్లస్ జీఎస్‌టీని కలిపి వసూలు చేయనుంది. బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, ఇరత బ్యాంకుల ఏటీఎంల నుంచి చేసే అన్ని అదనపు నగదు విత్‌డ్రాయల్స్‌కూ ఈ ఛార్జీలు వర్తిస్తాయి.
అదేవిధంగా ఇకపై పరిమితికి మించి చెక్కులు కావాలన్నా కూడా చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ప్రస్తుతం బీఎస్‌బీడీ ఖాతాదారులకు ప్రస్తుతం ఏడాదికి 10 లీఫ్స్ ఉండే ఒక చెక్‌బుక్‌ను ఎస్‌బీఐ ఉచితంగా జారీ చేస్తోంది.
జూలై 1 నుంచి ఆ పరిమితి మించితే 10 లీఫ్స్ చెక్‌బుక్‌కు రూ.40 ప్లస్ జీఎస్టీ, 25 లీఫ్స్ చెక్‌బుక్‌కు రూ.75 ప్లస్ జీఎస్‌టీ చెల్లించాలి. అత్యవసరంగా 10 లీఫ్స్ చెక్‌బుక్ కావాలన్నా బీఎస్‌బీడీ ఖాతాదారులు రూ.50 ప్లస్ జీఎస్‌టీ చెల్లించాలి. అయితే సీనియర్ సిటిజన్లను ఈ అదనపు చెక్‌బుక్ చార్జీల నుంచి మినహాయిస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.