ఖాతాదారుల కనీస నిల్వ మొత్తంపై ఎస్.బి.ఐ కీలక నిర్ణయం
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఖాతాల్లో కస్టమర్లు ఉండాల్సిన కనీస నిల్వ మొత్తాన్ని తగ్గించింది. ఈ నిబంధన వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీనిప్రకారం పట్టణ ప్రాంతాల్లోని స్టేట్ బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతాలో కనీసం రూ.3 వేల మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి. గతంలో ఇది రూ.5 వేలుగా ఉండేది. అలాగే సెమీ అర్బన్ ప్రాంతాల్లోని వారి ఖాతాల్లో కనీసం రూ.2,000 ఉంచాల్సి ఉంటుందని బ్యాంకు తెలిపింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ల ఖాతాలో కనీసం రూ.వెయ్యి నిల్వ ఉండటం తప్పనిసరి అని తేల్చిచెప్పింది.
ఒకవేళ ఈ నిబంధనలు పాటించకపోతే జరిమానాల వడ్డన తప్పదని స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లోని ఖాతాల్లో కనీస నిల్వ రూ.1500 వరకు మాత్రమే ఉంటే రూ.10, రూ.750 వరకు వుంటే రూ.12.75, ఇంకా అంతకు తగ్గిపోతే కనుక రూ.15 పెనాల్టీ చెల్లించాలి. దీనికి జీఎస్టీ కూడా అదనమని బ్యాంకు తెలిపింది.
ఇక సేవింగ్స్ ఖాతాలో నెలకు మూడు సార్లు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇదిదాటితే అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. నాలుగోసారి కనీసం రూ.100 డిపాజిట్ చేసినా రూ.50 చార్జీ కింద సమర్పించుకోవాల్సిందే. దీనికి కూడా జీఎస్టీ అదనం. అలాగే నాన్ హోం బ్రాంచీల ద్వారా గరిష్టంగా రూ.2 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు.
నెలకు కనీసం రూ.25,000 బ్యాంకు బ్యాలెన్స్ ఉంచే వ్యక్తులు నెలకు రెండు సార్లు ఉచితంగా బ్యాంకు నుంచి నగదును డ్రా చేసుకోవచ్చు. అదే రూ.25,000-50,000 మధ్య బ్యాలెన్స్ ఉంచేవారికి 10 విత్ డ్రాలు ఉచితంగా చేసుకోవచ్చు. ఇది రూ.50,000 దాటితే 15 సార్లు ఫ్రీగా నగదును డ్రా చేసుకోవచ్చు. నెలకు కనీస బ్యాలెన్స్ రూ.లక్ష ఉంచితే ఎన్నిసార్లయినా బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకోవచ్చు.
మరోవైపు మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నెలకు 10 సార్లు, నాన్ మెట్రో నగరాల్లో 12 సార్లు నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక ఇతర బ్యాంకుల ఏటీఎం కార్డుదారులు ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో ఐదుసార్లు ఉచితంగా నగదును తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణంతో చెక్‌బౌన్స్ అయితే జీఎస్టీతో కలుపుకుని రూ.168 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.