శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (10:47 IST)

జీఎస్టీ వసూళ్ళలో తెలంగాణ సరికొత్త రికార్డు

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ళలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. గత యేడాది జనవరి నెలతో పోల్చితే ఈ యేడాది జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో 19 శాతం మేరకు పెరిగాయి. 2019 జనవరిలో రూ.3,195 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ సంవత్సరం అది రూ.3,787 కోట్లకు పెరిగింది. 
 
కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం, చండీగఢ్ రాష్ట్రంలో అత్యధికంగా 22 శాతం మేరకు జీఎస్టీ వసూళ్లు పెరుగగా, ఆ తరువాత గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ నిలిచాయి. ఐదో స్థానంలో కేరళ 17 శాతం వృద్ధిని నమోదు చేసింది.
 
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల కాలంలో రూ.24,135.30 కోట్ల వస్తు సేవల పన్ను ఆదాయం వసూలైంది. మొత్తం మీద 2019-20లో రూ. 34,232.93 కోట్ల జీఎస్టీ ఆదాయం ఉంటుందని తొలుత అంచనా వేయగా, ఇప్పటికే 77.3 శాతం రాబడి వచ్చింది. 
 
మరో రెండు నెలలు మిగిలివుండగా, కనీసం రూ. 6 వేల కోట్ల వరకూ వసూలయ్యే అవకాశాలు ఉన్నాయని మొత్తం మీద టార్గెట్ లో 84 శాతం వసూళ్లను తెలంగాణ సాధించనుందని 15వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జీఎస్టీ వసూళ్లు పూర్తి నిరాశను కలిగిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.