శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (10:02 IST)

దేశంలో అత్యధిక వ్యాట్ వసూలు చేస్తున్న తెలంగాణ.. తగ్గించేదే లేదంటున్న సర్కారు

పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ సుంకం కాకుండా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ రూపంలో పన్నులను వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా, వ్యాట్‌ను అధిక మొత్తంలో వసూలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో వుంది. మొదటి స్థానంలో రాజస్థాన్ వుంది. ఈ కారణంగానే పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. 
 
ఈ నేపథ్యంలో దూకుడుగా దౌడు తీస్తున్న పెట్రో ధరల స్పీడుకు.. ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో కేంద్రం కొంతమేర బ్రేకులు వేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గింపుతో వినియోగదారులకు మరింత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణ సహా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది. 
 
అయితే, ఎంత ఒత్తిడి ఉన్నా తెలంగాణ సర్కారు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను 'తగ్గించేదే లే' అంటోంది! లీటరు పెట్రోలుపై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు రూ.5.7 నుంచి రూ.6.35 దాకా, డీజిల్‌ ధరలు రూ.11.6 నుంచి రూ.12.88 దాకా తగ్గిన సంగతి తెలిసిందే. 
 
అయితే, బీజేపీ పాలిత, ఎన్డీయేపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాట్‌ తగ్గించడంతో ఇతర రాష్ట్రాలపై ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కారు పెట్రోలుపై 35.2 శాతం, డీజిల్‌పై 27 శాతం చొప్పున వ్యాట్‌ను వసూలు చేస్తోంది. 
 
అత్యధిక వ్యాట్‌ను విధిస్తున్న రాష్ట్రం రాజస్థాన్‌ (రూ.36) కాగా.. రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణే. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచిన నేపథ్యంలో ఆ మేరకు పెట్రో ధరలు పెరిగి, రాష్ట్రాలకు వాటిపై వస్తున్న వ్యాట్‌ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ఇపుడు ఈ వ్యాట్‌ను తగ్గించాలని ఒత్తిడి వస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం ససేమిరా అంటున్నారు.