శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (08:44 IST)

పెంచింది కొండంత.. తగ్గించింది గోరంత : ఛత్తీస్‌గఢ్ సీఎం బాఘెల్

దీపావళి పండుగకు ముందు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.5, రూ.10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘెల్‌ స్పందించారు. ఈ తగ్గింపు సరిపోదని, యూపీఏ-2 హయాంలో ఉన్న స్థాయికి పెట్రో ధరలను తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. 
 
ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు దిగివచ్చి ఎక్సైజ్‌ డ్యూటీని కాస్తంత తగ్గించిందని ఎద్దేవా చేశారు. 'ముందేమో పెట్రోలు ధరలను రూ.30 దాకా ధర పెంచారు. ఇప్పుడు కేవలం రూ.5 తగ్గించి.. అందరి ప్రశంసలనూ కోరుకుంటున్నారు' అంటూ మండిపడ్డారు. 
 
ఎక్సైజ్‌ డ్యూటీ యూపీఏ హయాంలో రూ.9.27 ఉండేదని.. దాన్ని రూ.30కి పెంచేశారని.. అప్పటిలాగా ఇప్పుడు ఎక్సైజ్‌ డ్యూటీని రూ.9కి తగ్గించాలని, అప్పుడు ప్రజలకు మరింత ఉపశమనం కలుగుతుందని ఆయన సూచించారు. అదేసమయంలో తాము రాష్ట్రపరిధిలో ఉన్న పన్నులను తగ్గించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.