పెట్రోల్ - డీజల్ ధరల దూకుడు... రూ.120 దిశగా పయనం
దేశంలో చమురు ధరల పెరుగుదలకు ఇప్పట్లో అడ్డుకట్టపడేలా కనిపించడం లేదు. పండుగ తర్వాత చల్లబడుతుందేమో అనుకున్న పెట్రో మంట.. మళ్లీ ఎగసిపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా చమురు కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. దీంతో గురువారం మళ్లీ ధరలు పెరిగాయి. ఈ దూకుడు ఇదే విధంగా కొనసాగిన పక్షంలో అతి త్వరలోనే పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
గురువారం నాటి మార్కెట్ ధరల ప్రకారం లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగాయి. దీంతో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.54గాను, డీజిల్ ధర రూ.95.27కు ఎగబాకింది.
అటు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.112.44కి, డీజిల్ ధర రూ.103.26గా చేరింది. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో పెట్రో మంటలు ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రేటు రూ.117.98గా ఉంది. దేశంలో అత్యధిక ధర ఇదే కావడం గమనార్హం. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.92, డీజిల్ ధర రూ. 103.91కు చేరింది.