సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2023 (11:12 IST)

జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన ఎన్టీఏ

jee exam
దేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్స్ అడ్వాన్స్ పరీక్షల నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం విడుదల చేసింది. జేఈఈ మెయిన్ తొలి విడతకు దరఖాస్తుల ప్రక్రియను  కూడా ప్రారంభించింది. విద్యార్థులు ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఈ దరఖాస్తులను సమర్పింవచ్చు. 
 
ఈ పరీక్షను 2024లో రెండు విడతలుగా నిర్వహిస్తారు. మొదటి సెషన్ జనవరి నెలలోనూ, రెండో సేషన్ ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. పరీక్షకు రిజిస్ట్రేషన్‌కు నవంబరు ఒకటో తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. మెయిన్స్‌ పరీక్షకు ఇంటర్‌లో 75 శాతం మార్కులు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌లో చేరేందుకు జేఈఈ మెయిన్‌లో పేపర్‌-1, బీఆర్క్‌లో ప్రవేశానికి పేపర్‌-2ఏ, బీ-ప్లానింగ్‌లో ప్రవేశానికి పేపర్‌-2బీ రాయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పేపర్‌-1లో 300 మార్కులు(90 ప్రశ్నలు), పేపర్‌-2ఏలో 400 మార్కులు(82 ప్రశ్నలు), పేపర్‌-2బీలో 400 మార్కులు(105 ప్రశ్నలు) ఉంటాయి. ఫిబ్రవరి 12న స్కోర్‌ వెల్లడిస్తారు.
 
మెయిన్స్‌ పరీక్షల్లో కనీస స్కోర్‌ సాధించిన అన్ని క్యాటగిరీలకు చెందిన రెండున్నర లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత లభిస్తుంది.అడ్వాన్స్‌డ్‌లో పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి మాత్రమే ఐఐటీల్లో చేరేందుకు అవకాశం ఇస్తారు. తుది విడత జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. రెండుసార్లు పరీక్ష రాస్తే రెండింటిలో ఎక్కువ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకు కేటాయిస్తారు.
 
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌కు దాదాపు 11 లక్షల మంది హాజరవుతారని అంచనా. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేసే అవకాశాలున్నాయి. విద్యార్ధులకు ఏ నగరం/పట్టణంలో పరీక్ష కేంద్రాలను కేటాయించారో జనవరి రెండో వారంలో వెల్లడిస్తారు. పరీక్షకు మూడు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు.