అళగిరి రీ ఎంట్రీ.. అసెంబ్లీ ఎన్నికల కోసం.. కరుణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సమరానికి రెడీ అవుతున్నాయి. పార్టీలోని లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు, బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా డీఎంకే అధినేత కరుణానిధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తన కుమారుడు అళగిరిని మళ్లీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు.
తద్వారా డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి తిరిగి పార్టీలోకి అడుగుపెట్టబోతున్నారు. కుటుంబీకుల ఒత్తిడి, కొంతమంది పార్టీ నేతల వినతి మేరకే పెద్ద కుమారుడి రాకను కరుణానిధి అంగీకరించినట్లు తెలిసింది. అయితే రెండో కుమారుడు స్టాలిన్.. అళగిరి రీ ఎంట్రీపై అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోపే అళగరి డీఎంకేలో చేరుతారని సమాచారం.
తన వారసుడు స్టాలిన్ అంటూ గతంలో కరుణానిధి చేసిన ప్రకటనతో అళగిరి సహా ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దాంతో తండ్రి ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించి పార్టీ కార్యక్రమాలు, కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2013 చివరిలో అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి పార్టీకి దూరమైనప్పటికీ.. ఇతర పార్టీలో చేరబోనని అళగిరి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.