సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (14:50 IST)

తమిళనాడులోని తెలుగు ఓటర్లకు ఓటర్ లిస్టు తెలుగులోనే ఇవ్వాలి : వి.కృష్ణారావు

ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 6 వ తేదీన తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగువారు  అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాలలో ఓటర్ లిస్టు తెలుగులోనే ఇవ్వమని "ద్రావిడ దేశం" అధ్యక్షులు వి .కృష్ణారావు తమిళనాడు ఎలక్షన్ కమిషనర్‌కు ఓ లేఖ రాశారు. 
 
తమిళనాడు రాష్ట్రంలో అనేక జిల్లాలలో ముఖ్యంగా క్రిష్ణగిరి, కోయంబత్తూర్, సేలం, విరుదునగర్, తిరుచ్చి, మదురై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్ళూరు, చెన్నై జిల్లాలలో తమిళులకు సమానంగా తెలుగు, కన్నడం, మలయాళం, ఉర్దూ, హిందీ మాట్లాడే భాషా ప్రజలు నివశిస్తున్నారనియు, 1993వ సంవత్సరం అప్పటి ప్రభుత్వం వారిచే వెనుకబడిన మరియు అత్యంత వెనుకబడిన శాఖ వారిచే విడుదల చేసిన జీవో నెంబర్ 83 ప్రకారం  తమిళనాడు రాష్ట్రంలోని అనేక జిల్లాలలో 15 శాతం పైగా తమిళేతరులు నివసిస్తున్నారనియు, ఆ ప్రజలు ఏ భాషలో ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తారో ప్రభుత్వం వారు ప్రత్యుత్తరాలు కూడా ఆ భాషలోనే ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ప్రభుత్వం వారు ఈ ఉత్తర్వులను సరిగా అమలు పరచనందువల్ల గత 2016 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో ద్రావిడ దేశం తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రాసిన ఉత్తరం ద్వారా కోరిన  మేరకు తిరుత్తణి, హోసూరు నియోజకవర్గాలలో ఓటర్ లిస్ట్ తెలుగులో ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమిళేతర ప్రజలు అత్యధికంగా ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ నియోజకవర్గాలలో  తమిళంతో పాటు తెలుగు ,కన్నడం ,మలయాళం, ఉర్దూ, హిందీ భాషలలో కూడా ఓటర్ లిస్ట్ విడుదల చేసి ప్రజలకు  అందుబాటులో ఉంచవలసిందిగా కోరుతున్నట్టు ద్రావిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు ఎన్నికల కమిషనర్ను కోరారు.