సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 19 జులై 2017 (11:27 IST)

డీఐజీ రూపనే బెదిరించిన శశికళ.. మామూలు కిలాడీ అయితే కదా. జైల్లో అన్ని లగ్జరీలు కట్

అన్నాడీఎంకే నేత శశికళ మామూలు కిలాడీ కాదని మరోసారి రుజువైంది. కోట్లు పడేసి జైలు ఉన్నతాధికారులనే బుట్టలో వేసుకుని జైల్లోనే లగ్జరీ జీవితం గడుపాలని శశికళ వేసిన ప్లాన్ ఒక మహిళా ఐపీఎస్ నిజాయితీ కారణంగా బట్టబయలైపోయింది. అయితే ఆ ఐపీఎస్ అధికారిణి సాక్షాత్తూ శ

అన్నాడీఎంకే నేత శశికళ మామూలు కిలాడీ కాదని మరోసారి రుజువైంది. కోట్లు పడేసి జైలు ఉన్నతాధికారులనే బుట్టలో వేసుకుని జైల్లోనే లగ్జరీ జీవితం గడుపాలని శశికళ వేసిన ప్లాన్ ఒక మహిళా ఐపీఎస్ నిజాయితీ కారణంగా బట్టబయలైపోయింది. అయితే ఆ ఐపీఎస్ అధికారిణి సాక్షాత్తూ శశికళ డబ్బుపెట్టి కొనుక్కున్న ప్రత్యేక గదుల్లోకి వచ్చి అసలు విషయం కనిపెట్టినా సరే ఆమెతో వాదులాటకు వేసుకుని నాసంగతి నీకు తెలీదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాకు తెలుసు. తల్చుకుంటే వారంలోపే బదిలీ చేయించేస్తా అంటూ ఆగ్రహించింది శశికళ. కానీ ఆ మహిళాధికారి తాను పరన్పన అగ్రహార జైలులో చూసిన ప్రతిదీ వీడియోకెక్కించి మీరీ సీడీరూపంలో భద్రపర్చింది కాబట్టి శశికళ భండారం, ఆమెకు సకల సౌకర్యాలు సమకూర్చిన జైలు అధికారుల భండారం మొత్తం బయటపడిపోయింది. కొండను ఢీకొని వాస్తవాలు బయటపెట్టిన ఆ అధికారిణికి ఫలితం దక్కింది. జైళ్ల డీఐజీ నుంచి ట్రాఫిక్ డీఐజీగా బదిలీ అయింది. వందమంది మోదీలు వచ్చినా ఈ దేశాన్ని ఎవరూ బాగు చేయలేరు అనేందుకు రూప ఉదంతం ఒక ప్రత్యక్ష నిదర్శనం. 
 
తమిళనాడు రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా వెలుగొందిన శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార జైలును సైతం తన అగ్రహారంగా మార్చుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా జయలలిత వెన్నంటి ఉంటూ ఖరీదైన జీవితానికి అలవాటు పడిన ప్రాణం కావడంతో జైలు జీవితాన్ని తట్టుకోలేకపోయారు. కోటి రూపాయలు చూపిస్తే కొండమీద కోతైనా దిగివస్తుందనే సామెతను శశికళ ఆచరణలో పెట్టగా జైలు అధికారులు అక్షరాల అమలుచేశారు. జైలు జీవితాన్ని సైతం కళకళగా మార్చుకున్న శశికళ లగ్జరీ జీవితానికి లంగరుపడింది. లోపాయికారితనంతో జైలు అధికారులు కల్పించిన ప్రత్యేక సదుపాయాలకు ఉన్నతాధికారులు కత్తెరవేశారు. పరమపద సోపానపటంలో పెద్దపాము నోట్లో పడ్డట్టుగా అసాధారణ స్థితినుంచి జారిపోయి సాధారణ ఖైదీగా మారిపోయారు. జైల్లో రాజమర్యాదలు అనుభవించిన శశికళ చివరకు సాధారణ ఖైదీగా మారారని తెలిసింది. 
 
జైలు నాలుగు గోడల మధ్య శశికళకు రహస్యంగా జరుగుతున్న రాచమర్యాదలను కర్ణాటక జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప బట్టబయలుచేసి తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల్లో కలకలం రేపారు. జైల్లో ప్రత్యేక వైద్య సదుపాయాలతో కూడిన వంటగది, ములాఖత్‌ కింద వచ్చిన వారితో మాట్లాడేందుకు మరో గది, యోగా గది, టీవీ వీక్షణకు మరో రూం, బాత్‌రూం.. మొత్తం ఐదు గదులు, ఖరీదైన మంచం, సోఫా,  రిఫ్రిజిరేటర్, వాషింగ్‌ మెషీన్, ఇలా అనేక గృహోపకరణాలు, హాయిగా నడయాడేందుకు పొడవాటి వరండా కేటాయించారు. 
 
ఈ సదుపాయాల కల్పన కోసం మాజీ డీజీపీ సత్యనారాయణరావుకు రూ.2 కోట్లు లంచం ముట్టినట్లు రూప బహిరంగంగా చాటగా, అబ్బే అదేం లేదని డీజీపీ ఖండించారు. అయితే రూప ఆరోపణలు నిజమని నిరూపిస్తూ జైల్లోని చిన్నమ్మ లగ్జరీ జీవితం ఫొటోలతో సహా సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా బయటకు పొక్కింది. అంతేగాక, జైలు దుస్తుల్లో కాక ఖరీదైన నైటీలో చేతిలో బ్యాగ్‌తో శశికళ నడుస్తున్న వీడియో దృశ్యాలు తమిళనాడు, కర్ణాటక  ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేశాయి.
 
జైలు తనిఖీ సమయంలో శశికళకు కల్పించిన సదుపాయాలను చూసి బిత్తరపోయిన రూప వాటిని సెల్‌ఫోన్‌లో చి త్రీకరించారు.ఆ సమయంలో రూపతో శశికళ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. కర్ణాటక సీఎం నుంచి అందరూ నాకు తెలుసు, వారికి లేని అభ్యంతరం నీకెందుకు, వారం రోజుల్లో నిన్ను బదిలీ చేయిస్తా అని రూపను బెదిరించినట్లు సమాచారం. అయితే, ముందు జాగ్రత్త చర్యగా జైల్లో శశికళకు కల్పించిన ప్రత్యేక సదుపాయాలను సీసీ టీవీ కెమెరా నుం చి డౌన్‌లోడ్‌ చేసుకుని సీడీలో రికార్డు చేసుకున్న తరువాతనే మీడియా ముందుకు రూప వచ్చినట్లు  సమాచారం.
 
ఇదిలా ఉండగా, డీఐజీ రూప ప్రకటన వల్ల జైల్లోని లోగుట్టు రట్టుకావడంతో ప్రభుత్వం సోమవారం నుంచి సంస్కరణల బాట పట్టింది. రూప సహా నలుగురు అధికారులను బదిలీచేసింది. ముఖ్యంగా లోపాయికారిగా శశికళకు కల్పించిన సదుపాయాలను కోతవిధించింది. అధికారులు టీవీ కనెక్షన్‌ను తొలగించారు. వీఐపీగా చెలామణి అయిన శశికళ మంగళవారానికి సాధారణ ఖైదీగా మారిపోయారు. ఐదు గదుల నుంచి సాధారణ ఖైదీ గదికి ఆమెను మార్చారు. తన ప్రత్యేక వంట గదిలో ఇడ్లీ, దోసెలు, మాంసాహారం చేయించుకుని తినే శశికళ సోమవారం ఉదయం ఇతర ఖైదీలతోపాటూ నిమ్మకాయల అన్నం, మధ్యాహ్నం రాగిరొట్టె, పెరుగన్నం తిని టీ తాగారని తెలిసింది. ప్రతిరోజు రాత్రివేళ చపాతీ తినే శశికళకు సాంబారన్నం పెట్టారని సమాచారం. 
 
 
కాగా.. డీఐజీ రూప నిజాయితీతో కూడిన దూకుడును కొనసాగించాలని పుదుచ్చేరీ గవర్నర్‌ కిరణ్‌బేడీ సామాజిక మాధ్యమం ద్వారా సందేశం పంపారు.