గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జనవరి 2022 (15:50 IST)

నైనిటాల్‌లో నవోదయ స్కూల్‌ విద్యార్థులకు కరోనా...

దేశంలో కరోనా వైరస్ మళ్లీ బుసలుకొడుతోంది. ఇప్పటికే రోజు వారీ కేసులు నమోదు రెట్టింపు అయ్యాయి. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నవోదయా స్కూల్‌లో 85 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారినపడ్డారు. వీరందరినీ హాస్టల్‌లోనే ఐసోలేషన్‌లో ఉంచారు. 
 
నైనిటాల్‌ జిల్లాలోని జవహర్ నవోదయ స్కూల్‌లో చదివే విద్యార్థుల్లో తొలుత 11 మందికి ఈ వైరస్ సోకింది. దీంతో అప్రమత్తమైన ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్కూల్‌లోని 488 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 85 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వారిని హాస్టల్‌లోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, గత నెల 30వ తేదీన 8 మంది విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆ స్కూల్‌లో చదివే విద్యార్థుల్లో 70 శాతం మంది విద్యార్థులు దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.