మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (09:16 IST)

అస్సాంలో కరోనా బాధితులంతా మర్కజ్‌కు వెళ్లొచ్చినవారే...

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కూడా కరోనా వైరస్ సోకింది. మొత్తం 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 15 మంది ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లివచ్చినవారే కావడం గమనార్హం. ఈ విషయాన్ని అస్సాం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. 
 
కాగా, అస్సాం రాష్ట్రంలో సోమవారం వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మంగళవారం రాత్రి తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా సోకిన 52 ఏళ్ల వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. కరోనా సోకిన వ్యక్తిని కరీంగంజ్‌కు చెందిన వ్యక్తిగా అధికారులు నిర్ధారించారు. మిగతా 15 మంది గోలాఘాట్‌ జిల్లాకు చెందిన వారు. ఈ 15 మంది మర్కజ్‌ ప్రార్థనలకు హాజరై వచ్చిన వారని అధికారులు తెలిపారు. వీరిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారిని దేశ వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. ఇప్పటివరకు 6000 మందిని గుర్తించారు. మరో 2 వేల మంది కోసం గాలిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో కొత్తగా వెలుగుచూసిన పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మంది ఆ కార్యక్రమంలో పాల్గొని వచ్చినవారే ఉంటున్నారు. 300కుపైగా కేసులకు మర్కజ్‌తో లింకులు ఉన్నాయి. 
 
వీటిలో ఒక్క తమిళనాడులోనే 190 కేసులున్నాయి. ఆ తర్వాత ఏపీలో 70, ఢిల్లీ 24, తెలంగాణ 21, అస్సాం 15, అండమాన్‌ 10, పుదుచ్చేరి 2, కశ్మీర్‌లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కరోనా వ్యాప్తికి కేంద్రకంగా మారిన నిజాముద్దీన్‌ మర్కజ్‌లో ఉన్నవారిని ఎట్టకేలకు ఖాళీచేయించారు. గత 36 గంటల్లో మొత్తం 2,361 మందిని అక్కడి నుంచి తరలించారు.