శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 జులై 2021 (09:39 IST)

థర్డ్ వేవ్‌తో ప్రమాదం.. అలా గాలికి వదిలేస్తే కష్టమే.. కేంద్రం హెచ్చరిక

మళ్లీ కరోనా మహమ్మారి విజృంభించి థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కరోనా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, అందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేసి చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం లేక రాశారు. 
 
'R ఫ్యాక్టర్‌ (రీప్రొడక్షన్‌ నంబర్‌)' 1 ని దాటితే ప్రమాదమని.. ఆ ప్రాంతాల్లో మళ్లీ కరోనా వ్యాప్తతి మొదలయినట్లేనని ఆయన హెచ్చరించారు. ఎక్కడైనా కరోనా నిబంధనలను పాటించకపోతే ఆ ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు విధించాలని స్పష్టం చేశారు. రూల్స్ పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. 
 
ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, మార్కెట్లు, ప్రజా రవాణా వంటి చోట్ల నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. ఫలితంగా ఆర్ ఫ్యాక్టర్ పెరుగుతోంది. ఆర్ ఫ్యాక్టర్ దాటితే ప్రమాదకరం. 
 
అందుకే జనం రద్దీ ఎక్కువగా ఉండే దుకాణాలు, మార్కెట్లు, వారాంతపు సంతలు, బార్లు, రెస్టారెండ్లలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల, పార్క్‌లు, జిమ్‌లు, స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ వంటి చోట కరోనా నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. 
 
ఆ బాధ్యతలను అధికారులకు అప్పగించాలి. నిబంధనలను అమలు చేయని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించాలి. ఐదు అంచెల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలి. ఇందులో ఎక్కడ నిర్లక్ష్యం ఉన్నా అందుకు అధికారులను బాధ్యులను చేయాలని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు.