శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (15:19 IST)

కరోనా సెకండ్ వేవ్‌.. జూన్‌ 30 వరకూ ఆ మార్గదర్శకాలను కొనసాగించండి.. కేంద్రం

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 29న తాము జారీ చేసిన మార్గదర్శకాలను మరికొంతకాలం కొనసాగించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలకు లేఖలు రాశారు. కరోనా పరిస్ధితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.
 
ఏప్రిల్ 29న కరోనా సెకండ్ వేవ్‌ దృష్ట్యా తాము జారీ చేసిన మార్గదర్శకాలను జూన్‌ 30 వరకూ కొనసాగించాలని కేంద్రం రాష్టాలను కోరింది. ముఖ్యంగా పది శాతం కంటే పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న చోట్ల, బెడ్ల ఆక్యుపెన్సీ 60 శాతం దాటి ఉన్న చోట్ల కోవిడ్ మార్గదర్శకాల అమలు తప్పనిసరని తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న కంటెన్‌మెంట్‌ నిబంధనల కారణంగా చాలా ప్రాంతాల్లో కోవిడ్‌ తగ్గుముఖం పట్టినా ఇంకా పలు చోట్ల కేసులు ఎక్కువగా ఉండటాన్ని కేంద్రం గుర్తు చేసింది.
 
కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ఇంకా యాక్టివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న విషయాన్ని కేంద్రం తాజా లేఖలో రాష్ట్రాలకు గుర్తు చేసింది. పరిస్ధితి పూర్తిగా అదుపులోకి రావాలంటే కంటెయిన్‌మెంట్‌ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. 
 
తప్పనిసరి పరిస్ధితుల్లో ఎక్కడైనా మినహాయింపులు ఇవ్వాల్సి వస్తే పరిస్ధితుల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. ఇందు కోసం స్ధానిక పరిస్ధితుల్ని, వైద్యం అందుబాటు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుని దశల వారీగా చర్యలు చేపట్టాలని తెలిపింది.