సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 జూన్ 2020 (11:21 IST)

దేశంలో కరోనా వైరస్ కల్లోలం : 24 గంటల్లో 19459 కొత్త కేసుల

దేశంలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 19459 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ గడచినగడచిన  24 గంటల్లో నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, గత 24 గంటల్లో 380 మంది మరణించినట్టు పేర్కొంది. 
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,48,318కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,475కి పెరిగింది. 2,10,120 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,21,723 మంది కోలుకున్నారు.
 
కాగా, జూన్‌ 28 వరకు దేశంలో మొత్తం 83,98,362 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఆదివారం ఒక్కరోజులో 1,70,560 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.
 
తెలంగాణ హాం మంత్రికి కరోనా పాజిటివ్ 
తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా వైరస్ సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. 
 
మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. హోంమంత్రి ఆరోగ్యంపై సహచర మంత్రులు వాకబు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 
 
మరోవైపు, కరీంనగర్‌లో ఓ టీఆర్‌ఎస్ ప్రముఖుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా సదరు టీఆర్ఎస్ నేత హరితహారంలో పాల్గొన్నారు. 
 
ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొందరు సెల్ఫ్ క్వారన్‌టైన్‌లోకి వెళ్లారు. దీంతో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.