శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (10:58 IST)

కరోనా కేసుల్లోనే కాదు.. మరణాల్లోనూ చైనాను దాటేసిన భారత్!

దేశంలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఏకంగా 7466 కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒకే రోజు 175 మంది చనిపోయారు. ఇది దేశ ప్రజలను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది. 
 
ముఖ్యంగా, ఇప్పటికే కరోనా కేసుల్లో వైరస్ పురుడు పోసుకున్న చైనాను దాటేసిన భారత్... ఇపుడు మరణాల సంఖ్యలోనూ డ్రాగన్ కంట్రీని అధికమించింది. చైనాలో కరోనా మృతులు ఇప్పటివరకు 4634గా ఉండగా, భారత్‌లో ఈ సంఖ్య 4706కు చేరుకుంది. దీంతో పరిస్థితి మరింత దిగజారినట్టుగా తెలుస్తోంది. 
 
ఇకపోతే, కరోనా కేసుల విషయంలోనూ భారత్ 9వ స్థానానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 1.82 లక్షల కేసులతో జర్మనీ 8వ స్థానంలో వుండగా, 1.60 లక్షల కేసులతో టర్కీ పదో స్థానంలో ఉంది. కేసులు, మరణాల విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, అనూహ్యంగా బ్రెజిల్ రెండో స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత వరుసగా రష్యా, స్పెయిన్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్‌లు టాప్-10లో ఉన్నాయి.
 
కరోనా వీర కుమ్ముడు : ఒక్క రోజే 7466 పాజిటివ్ కేసులు 
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డూఆపు లేకుండా పోతోంది. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.  శుక్రవారం మరో ఏడువేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 7,466 మందికి కొత్తగా కరోనా సోకింది. 
 
ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. 175 మంది మరణించారు. అలాగే, ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,65,799కి చేరగా, మృతుల సంఖ్య 4,706 చేరుకుంది. 89,987 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 71,105 మంది కోలుకున్నారు.
 
మహారాష్ట్రలో మరణ మృదంగం  
మరోవైపు, మహారాష్ట్రలో పరిస్థితి రోజురోజుకూ మరింతగా దిగజారిపోతోంది. రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి మారణహోమం సృష్టిస్తోంది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్క రోజే 105 మందిని కరోనా బలితీసుకుంది. దేశవ్యాప్తంగా నిన్న సంభవించిన మరణాల్లో ఇది 54 శాతం కావడం గమనార్హం.
 
అలాగే, రాష్ట్రంలో గత 24 గంటల్లో 130 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడిన పోలీసుల సంఖ్య 2,095కి చేరుకుంది. 22 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 2,598 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 56,948కి పెరగ్గా, 1,897 మరణాలు నమోదయ్యాయి.