కోవిడ్ చికిత్సలో మరో కొత్త ఔషధం... ఒక డోసు ధర రూ.59,750
కోవిడ్ చికిత్సలో మరో కొత్త ఔషధం ప్రవేశించింది. దీన్ని యాంటీబాడీ కాక్ టెయిల్ అంటారు. ప్రముఖ ఫార్మా సంస్థలు సిప్లా-రోచ్ ఇండియా సంయుక్తంగా దీన్ని భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టాయి. అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో కరోనా బారినపడిన డొనాల్డ్ ట్రంప్‌కు ఈ మందునే వాడారు. ఈ కాక్ టెయిల్ ఔషధంలో రెండు మందులు కలిసి ఉంటాయి.
ఇమిడివిమాబ్, కాసిరివిమాబ్ ఔషధాల కలయికనే ఈ కాక్ టెయిల్ ఔషధం. భారత మార్కెట్లో 1200 ఎంజీ ఒక డోసు యాంటీబాడీ కాక్ టెయిల్‌ను రూ.59,750కి విక్రయించనున్నారు. ఒక్క ప్యాక్‌ను ఇద్దరు రోగులకు వినియోగించవచ్చని తయారీదార్లు పేర్కొన్నారు.
దీన్ని సాధారణ రిఫ్రిజిరేటర్లలో భద్రపరచవచ్చు. తక్కువ, ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నవారికి దీన్ని అందించవచ్చు. ఇది వాడితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువ అని రోచ్ ఇండియా, సిప్లా వర్గాలు వెల్లడించాయి. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ ను వాడొచ్చని తెలిపాయి.