శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (22:21 IST)

భాగ్యనగరిపై కరోనా పంజా - 15 రోజుల్లో రెట్టింపు పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మరణాలు హడలెత్తిస్తున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా ఏడుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.
 
అలాగే, కొత్తగా మరో 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 3020కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 108 ఉన్నాయి. 
 
అలాగే, రంగారెడ్డి, అసిఫాబాద్‌ 6, సిరిసిల్ల, మేడ్చల్‌ 2, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ఇవాళ కొత్తగా ఇద్దరు వలస కూలీలకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. 
 
భాగ్యనగరంపై కరోనా పంజా 
మరోవైపు, భాగ్యనగరంపై కరోనా పంజా విసురుతోంది. లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. లాక్డౌన్‌ ఆంక్షలను కరోనా కేసులు ఉన్న ప్రాంతాలకే పరిమితం చేసి, మిగిలిన ప్రాంతాల్లో సడలింపులు పూర్తిగా ఎత్తివేశారు. ఫలితంగా కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది.
 
ముఖ్యంగా మే 15 నుంచి ఆంక్షలను సడలించడంతో జనం రాకపోకలు పెరిగాయి. ఫలితంగా గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాలకూ వైరస్‌ విస్తరిస్తోంది. హైదరాబాద్‌లో మే నెల తొలి 15 రోజుల్లో 363 కేసులు నమోదైతే.. 16 నుంచి 31వ తేదీ వరకు 652 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంటే.. 15 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం.