శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (14:28 IST)

సుప్రిసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రమాదకర పరిస్థితులు... ఆందోళనలో స్థానికులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ కేసుల భయంతో తిరుపతి, శ్రీకాళహస్తి వంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. 
 
ముఖ్యంగా తిరుపతి విషయానికి వస్తే నగరంలో 12, రూరల్‌ మండలంలో 2 చొప్పున 14 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ తిరుపతి నగరంలో 146, రూరల్‌లో 37 చొప్పున మొత్తం 183 కేసులు వెలుగు చూశాయి. 
 
అలాగే, శ్రీకాళహస్తిలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 130కి చేరుకుంది. తిరుపతి, శ్రీకాళహస్తిలలో నమోదైన కేసులు ఆయా పట్టణాల స్థాయి దృష్ట్యా రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా అత్యధికంగానే పరిగణించాలి. 
 
తాజాగా, జిల్లాలో 32 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో 12, రూరల్‌లో 2, పుత్తూరులో 6, చిత్తూరు, నగరిలో నాలుగు చొప్పున, రేణిగుంట, శ్రీకాళహస్తిలలో రెండు చొప్పున కేసులున్నాయి. 
 
పుత్తూరులో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలతో పాటు వారి 17, 15 ఏళ్ల కుమారులిద్దరికీ వైరస్‌ సోకింది. శ్రీకాళహస్తిలో ఇద్దరు రిమాండు ఖైదీలకు పాజిటివ్‌ తేలింది. దీంతో జైలుకు పంపాల్సిన వారిని తిరుపతి కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు.