సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జులై 2021 (09:40 IST)

ఇరాక్‌ కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 92కి చేరిన మృతుల సంఖ్య

Iraq
ఇరాక్‌లో కొవిడ్‌ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 92కి చేరింది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షత గాత్రులంతా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో గత మూడు నెలల కాలంలో ఇది రెండో ఘటన.. ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత వైఖరి కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్‌ హుస్సేన్‌ టీచింగ్‌ ఆస్పత్రిలోని కోవిడ్‌ వార్డులో సోమవారం (జూలై 13) రాత్రి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
 
కరోనా బాధితులు ఈ మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పారు. మంగళవారం (జూలై 14) ఉదయానికి కాలిన మృత దేహాలు వెలికితీశారు. ఆ ప్రాంతమంతా రోగులు, బంధువుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియదు. ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అని కొందరు అంటుంటే.. మరికొందరు ఆక్సిజన్‌ సిలండర్‌ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.
 
మూడు నెలల క్రితమే ఆస్పత్రిలో కరోనా వార్డును 70 పడకలతో ప్రారంభించారు. గత ఏప్రిల్‌లో బాగ్దాద్‌లోని ఇబ్న్ అల్-ఖతీబ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది మరణించారు. ఈ విపత్తుతో ఇరాక్ ఆరోగ్య మంత్రి రాజీనామా చేశారు. ఇరాక్‌లో ఇప్పటికే కరోనా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజుకు రోజుకు కరోనా కొత్త కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత వారం 9వేలకు చేరుకున్నాయి. ఇరాక్ లో 17వేల మరణాలు 1.4 మిలియన్ కేసులు నమోదయ్యాయి.