మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (16:49 IST)

భారత్‌లో రికార్డు : తొలి కరోనా రోగికి మళ్లీ కరోనా పాజిటివ్

దేశంలో తొలి కరోనా బాధితురాలిగా రికార్డు పుటలకెక్కిన బాధితురాలికి మళ్లీ కరోనా వైరస్ సోకింది. ఇలా రావడం అరుదైన కేసుగా భావిస్తున్నారు. భారత్‌లో తొలి కరోనా పేషెంట్‌గా రికార్డులకెక్కిన కేరళ యువతి మరోసారి కరోనా వైరస్ సోకింది. త్రిశూర్ వాసి అయిన ఆమె చైనాలో వైద్య విద్య అభ్యసిస్తూ కరోనా సంక్షోభం కారణంగా గత యేడాది జనవరిలో స్నేహితులతో పాటు భారత్‌కు తిరిగొచ్చారు. 
 
ఈ క్రమంలో ఆమె దేశంలో అడుగు పెట్టాక పాజిటివ్ అని తేలింది. అయితే ఆ యువతి తాజాగా మరోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు. ఆమెలో కరోనా లక్షణాలు లేవని కూడా వారు తెలిపారు. 
 
ఈమె ఢిల్లీ వెళ్లేందుకు ఇటీవల కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఇప్పటికే ఆమె కరోనా టీకా తొలి డోసు కూడా తీసుకుందని పేర్కొన్నారు.
 
కాగా తొలిసారి కరోనా వైసక్ సోకడం వల్ల ఆమె నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో గడపాల్సి వచ్చింది. ఆమెతో పాటూ వూహాన్ నుంచి తిరిగొచ్చిన మరో ఇద్దరు స్నేహితులు కూడా కొంతకాలం తర్వాత కరోనా కాటుకు గురైయ్యారు.