శ్రీలంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కు కరోనా పాజిటివ్
ఇంగ్లాండ్ టెస్టును వణికించిన కరోనా మహమ్మారి తాజాగా శ్రీలంక జట్టుపై ప్రభావం చూపుతోంది. టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంక బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పీసీఆర్ టెస్టులలో గ్రాంట్ ఫ్లవర్‌కు కరోనా పాజిటివ్ అని తేలినట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లు, నలుగురు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో దాదాపు మొత్తం జట్టును, సహాయక సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉంచారు.
స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించి పాక్‌తో వన్డే సిరీస్ కొనసాగిస్తున్నారు. మరోవైపు టీమిండియాతో శ్రీలంక వన్డే, టీ20 సిరీస్‌లకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో స్వల్ప లక్షణాలు కనిపించడంతో గ్రాంట్ ఫ్లవర్‌కు కరోనా టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని లంక బోర్డు గురువారం వెల్లడించింది.
ఇంగ్లాండ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన శ్రీలంక జట్టు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. జులై 13నుంచి టీమిండియాతో లంక టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. బయో బబుల్‌లోకి శ్రీలంక ఆటగాళ్లు వస్తారని, ఇదివరకే భారత క్రికెటర్లు పర్యటనకు వచ్చారిన ఏఎన్ఐ మీడియాతో లంక బోర్డు తెలిపింది.