శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఐపీఎల్ 14 : కర్నాటక ఫాస్ట్ బౌలర్‌ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా

స్వదేశంలో జరుగుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ పోటీలు అర్థాంతరంగా ఆగిపోయాయి. దీనికి కారణం కరోనా వైరస్. ఈ టోర్నీపై కరోనా ప్రభావం పడటంతో నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, కరోనా ప్రభావం మాత్రం జట్టు ఆటగాళ్ళపై కొనసాగుతూనే ఉంది. 
 
టోర్నీ ఆపేసిన నాలుగు రోజుల తర్వాత కొత్తగా ఇద్దరు ఐపీఎల్‌ ఆటగాళ్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. అందులో ఒకరు కర్ణాటక ఫాస్ట్‌బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కాగా.. మరొకరు న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ టిమ్‌ సీఫర్ట్‌. వీళ్లిద్దరూ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. 
 
ఐపీఎల్‌ ఆగిపోయాక ప్రసిద్ధ్‌ తన స్వస్థలం బెంగళూరుకు బయల్దేరే ముందు చివరగా నిర్వహించిన ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చింది. అయితే అతను విమాన ప్రయాణం ద్వారా బెంగళూరుకు చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాతి రోజే స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నాడు. అందులో పాజిటివ్‌ వచ్చింది.
 
ఇకపతో, తమ దేశ ఆటగాడు టిమ్‌ సీఫర్ట్‌కు పాజిటివ్‌ అని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. అహ్మదాబాద్‌లో ఉన్న సీఫర్ట్‌ను చెన్నైకి తరలించి అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించనున్నారు. బబుల్‌లో తొలుత పాజిటివ్‌గా తేలిన వరుణ్‌ చక్రవర్తి, సందీప్‌ వారియర్‌లు కోల్‌కతా ఆటగాళ్లే కావడం గమనార్హం.