ఆక్సిజన్ సిలిండర్ పేలి కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... 44 మంది మృతి
ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంబవించింది. ఈ దేశంలోని నసిరియా పట్టణంలోని కోవిడ్ కేర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో 44 మంది మృత్యువాతపడ్డారు. నసిరియా పట్టణంలోని అల్-హుస్సేన్ కొవిడ్ ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగింది.
ఆసుపత్రి ప్రాంగణంలోని ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు నలువైపులా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక, అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, దట్టంగా కమ్ముకున్న పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో మంటల్లో చిక్కుకున్న వారిలో 44 మంది చనిపోగా మరో 67 మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగతా వారిని మరో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇక్కడ గత ఏప్రిల్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ కొవిడ్ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ట్యాంక్ పేలి 82 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికిపైగా గాయపడిన విషయం తెల్సిందే.
కాగా, ఈ ప్రమదం జరిగిన వెంటనే సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమైన ప్రధాని ముస్తాఫా అల్-కదిమి నసిరియాలోని ఆరోగ్య, సివిల్ డిఫెన్స్ మేనేజర్లను సస్పెండ్ చేసి, అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆసుపత్రి మేనేజర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు అరెస్టు చేయనున్నారు.