మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (20:34 IST)

చైనా ముందే చెప్పి వుంటే తప్పించుకునేవాళ్లం: ట్రంప్ అసహనం

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించడం చూస్తూనే వున్నాం. ఈ వైరస్ చాప కింద నీరులా ప్రపంచంలోని ఒక్కొక్క దేశానికి పాకుతూ పోతోంది. నియంత్రణ చర్యలు తీసుకునేలోపే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇటలీలో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
 
ఇదిలావుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్ గురించి చైనా ముందే చెప్పాల్సిందని ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు. చైనా ఈ వైరస్ విధ్వంసకరమైనదనీ, దాని లక్షణాలను పూర్తిగా చెప్పి ప్రపంచ దేశాలను జాగృతం చేసి వున్నట్లయితే ఇంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది కాదన్నారు.
 
కరోనా వైరస్‌పై చైనా ముందుగానే సమాచారం ఇవ్వకపోవడంతో పాటు తగిన సహకారం అందించనందుకు తాను ఎంతగానో కలత చెందానని ట్రంప్ పరోక్షంగా విమర్శలు చేశారు. ఐతే చైనా అంటే తనకు ఇష్టమని చెప్పిన ఆయన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అంటే తనకు ఎంతో గౌరవమన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యానిస్తున్నారు.