శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జులై 2020 (16:23 IST)

ఆంధ్రాలో ఆ వయసు వారికే కరోనా వైరస్ సోకుతుందా?

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి. గత కొన్ని రోజులుగా వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18 వేలు దాటిపోయాయి. 
 
అయితే మరణాల రేటు తక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం. 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీలోనే మరణాల సంఖ్య తక్కువగా ఉంది. అయితే, కరోనా వ్యాప్తి చెందుతున్న తీరు ఆందోళనకంగా ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
 
సాధారణంగా పెద్ద వయస్కులకు కరోనా సులభంగా సోకే అవకాశం ఉందని చెబుతున్నా, ఏపీలో మాత్రం 16 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులకు కరోనా ఎక్కువగా వ్యాపిస్తోందని వెల్లడైంది. 
 
జూలై 3 వరకు నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకుంటే 16 నుంచి 45 ఏళ్ల లోపు వారు 62 శాతం (10,500 కేసులు) ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత 46 నుంచి 60 ఏళ్ల వయసున్న వారు 20 శాతం (3,450 కేసులు) ఉన్నారట.
 
ఇక, 15 ఏళ్ల లోపు పిల్లల్లో కరోనా సోకిన వారి సంఖ్య 1200గా (7.18 శాతం) నమోదైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పిల్లల్లో చాలా తక్కువగానే కరోనా లక్షణాలు కనిపిస్తుండడమే కాదు, కొందరిలో అసలు లక్షణాలే ఉండడంలేదట. వారు చికిత్సకు కూడా చక్కగా స్పందిస్తున్నారని వైద్య వర్గాలంటున్నాయి.
 
రాష్ట్రంలో 60 ఏళ్లకు పైబడిన కరోనా బాధితులు 9.96 శాతం ఉండగా, మరణాల సంఖ్య కూడా వారిలోనే ఎక్కువగా ఉందని స్పష్టమైంది. వృద్ధుల్లో మధుమేహం, బీపీ, హృద్రోగాలు ఉండడంతో మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు వివరించారు.
 
మరోవైపు, గడచిన 24 గంటల్లో 14 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఐదుగురు మరణించగా, అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు మృతి చెందారు. దాంతో కరోనా మృతుల సంఖ్య 232కి పెరిగింది.
 
అటు, 998 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 157, తూర్పు గోదావరి జిల్లాలో 118 మందికి కరోనా సోకింది. కొన్నిరోజుల కిందటి వరకు తక్కువ కేసులు వస్తున్న శ్రీకాకుళం జిల్లాలో తాజాగా 96 మంది కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తోంది. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 18,697 కేసులు నమోదయ్యాయి. తాజాగా 391 మంది డిశ్చార్జి కావడంతో ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,422కి చేరింది. ప్రస్తుతం 7,907 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 2,136 మంది కొవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.