సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జులై 2020 (08:54 IST)

కోవ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగానికి నిమ్స్ సిద్ధం!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో భాగంగా, ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఫార్మా దిగ్గజం అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్ టీకాను మానవులపై ప్రయోగించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా పలు ఆస్పత్రులను ఎంపిక చేశారు. ఇందులో హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రి ఒకటి. 
 
ఇక్కడ ఈ నెల ఏడో తేదీ నుంచి కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. నిమ్స్‌లో గతంలో పలు క్లినికల్ ప్రయోగాలు చేపట్టిన నేపథ్యంలో కోవాగ్జిన్ ఫేజ్ 1 ప్రయోగాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ తెలిపారు. క్లినికల్ ప్రయోగాల కోసం ఐసీఎంఆర్ బడ్జెట్ విడుదల చేసినట్టు చెప్పారు.
 
టీకా ప్రయోగాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఔషధ ప్రయోగాల నైతిక విలువల కమిటీ శనివారం సమావేశమైందని, ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను ఐసీఎంఆర్‌కు నివేదించనున్నట్టు పేర్కొన్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే టీకా ప్రయోగాలు ప్రారంభించనున్నట్టు డాక్టర్ మనోహర్ తెలిపారు.